చేదెక్కిన రొయ్యలు...ట్రంప్ దెబ్బకు పడిపోయిన దరలు
ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రంప్ భారత్ నుంచి ఎగుమతుల సుంకం పెంచడంతో రొయ్యల పెంపకం దారులు ఇబ్బందులు పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రంప్ భారత్ నుంచి ఎగుమతుల సుంకం పెంచడంతో రొయ్యల పెంపకం దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులలో ప్రధమ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పండించే మొత్తం రొయ్యలలో సుమారు డెబ్భయి శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. రొయ్యలు అంటే ఇష్టపడే వారు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉండటంతో వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. 1990వ దశకం నుంచి రొయ్యలకు అధిక ధర లభించడంతో వాటిని ఉత్పత్తి చేసే చేరువల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పంట పొలాలను కూడా రొయ్యల చెరువులుగా మార్చి మరీ ఉత్పత్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని...
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు రొయ్యల ఉత్పత్తి కేంద్రాలుగా పేరుగాంచాయి. ఈ ఉత్పత్తి ప్రధానంగా అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.కానీ ఇటీవల అమెరికా ప్రభుత్వం భారతీయ రొయ్యలపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించింది. ఇది ఇప్పటికే ఉన్న యాంటీ-డంపింగ్ డ్యూటీలు, కౌంటర్‌వైలింగ్ డ్యూటీలకు అదనంగా ఉండటంతో, మొత్తం రుసుము 30 నుంచి 37 శాతం వరకు పెరిగింది. ఈ భారీ సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లో భారత రొయ్యల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎక్వడార్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు తక్కువ రుసుములతో రొయ్యలను అమెరికాకు సరఫరా చేస్తుండటంతో వాటినే కొనుగోలు చేస్తున్నారు.
ఎగుమతుల ప్రభావంతో...
ట్రంప్ సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని రొయ్యల రైతులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడంతో ఎగుమతిదారులు కొనుగోలు ఆర్డర్లను తగ్గించడంతో రొయ్యల రైతులు ఇబ్బందులు పడుతున్నార. రొయ్యలు మామూలుగా అయితే ఎగుమతి ధర కిలోకు 270 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఉండగా, ఇప్పుడు మరింత పడిపోయింది. దేశీయ మార్కెట్ లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు మూడు లక్షల మంది రొయ్యల సాగులో నేరుగా ఉపాధి పొందుతుండగా, ప్యాకింగ్, ప్రాసెసింగ్, ఐస్ తయారీ, రవాణా, ఫీడ్ ఉత్పత్తి వంటి అనుబంధ రంగాల్లో మరికొన్ని లక్షల మంది ఆధారపడుతున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర లభించకపోతే వీళ్లంతా ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు.