Congress : కాంగ్రెస్ అంటే ఆ మాత్రం కిక్కు లేకపోతే ఎలా?

మేడారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2025-10-11 12:39 GMT

మేడారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వంద కోట్ల రూపాయలకు పైగానే నిధులు కేటాయించింది. ఈ నిధులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రుల మధ్య యుద్ధానికి దారి తీసింది. ఇటీవల మేడారం సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష జరిపి అభివృద్ధి పనులు సతర్వమే చేపట్టాలని లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు తగిన డిజైన్లను కూడా గ్రాఫిక్స్ లో చూపారు. ఇంకేముంది.. పనులు ప్రారంభమవుతాయి. త్వరలోజరగనున్న మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఇద్దరు మంత్రుల వివాదం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

మేడారం టెండర్ల విషయంలో...
ఇటీవల ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వివాదం ముగిసిపోకముందే.. మరొకవైపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఇన్ ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వార్ మొదలయింది. ఈ నిధులు తమకు సంబంధం లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కొండా దంపతులు ఏకంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లిన కొండా మురళి వరంగల్ రాజకీయాల్లో పొంగులేటి జోక్యంపైనా, నిధుల ఖర్చు చేయడంపై తన అనుయాయులకు కట్టబెడుతున్నారని ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ మంత్రినైన తనకు తెలియకుండా టెండర్లను వేరే వారికి అప్పగిస్తున్నారన్నది కొండా కుటుంబం ఆరోపణ.
పొంగులేటిపై ఫిర్యాదు...
తనకు సంబంధం లేని పనిలోనూ పొంగులేటి తలదూరుస్తున్నారంటూ ఏకంగా ఏఐసీసీకి కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఖర్గేతో పాటు పార్టీ పెద్దలకు కూడా కొండా మురళి పొంగులేటిపై లేఖ రాయడంతో ఈ మంత్రుల వివాదం రోడ్డున పడింది. అసలే వరంగల్ జిల్లాలో కొండా కుటుంబంపై ఎమ్మెల్యేలంతా ఏకమై క్రమశిక్షణా కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వారికితోడు పొంగులేటి కూడా చేరినట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిసి ఒకింత ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంట్రాక్టు పనుల్లో జోక్యంలో మంత్రులు కొట్లాట పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో నెట్టినట్లయింది. కాంగ్రెస్ పార్టీ కదా.. ఆ మాత్రం కిక్కు ఉండాల్సిందే... ఏమీ లేకుండా చప్పగా సాగితే అది కాంగ్రెస్ పాలన ఎలా అవుతుంది? అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News