హైడ్రో కార్బన్ హబ్‌గా కాకినాడ

Update: 2016-11-21 18:08 GMT

తూర్పుగోదావరి జిల్లా కాకినాడను హైడ్రో కార్బన్ హబ్‌గా తయారుచేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. గోదావరి-కృష్ణా బేసిన్‌లో అపార చమురు-సహజవాయు నిక్షేపాలను వెలికితీస్తున్న ఓఎన్‌జీసీ, మరికొన్ని అదే తరహా సంస్థల కన్సార్టియమ్‌ను ఏర్పాటుచేసి రాష్ట్రంలో హైడ్రో కార్బన్ ప్రాజెక్టులను చేపట్టే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కాకినాడలో ఈ తరహా ప్రాజెక్టులు రెండింటిని చేపట్టడానికి ముందుకొచ్చిన ఓఎన్‌జీసీకి అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.

సోమవారం రాత్రి తన నివాసంలో తనను కలిసేందుకు వచ్చిన ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అలోక్‌నందన్‌తో ముఖ్యమంత్రి కాసేపు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. కాకినాడ సమీపంలో రెండు హైడ్రో కార్బన్ ప్రాజెక్టులను చేపట్టేందుకు తమ సంస్థ సంసిద్ధంగా వున్నదని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో కాకినాడ హైడ్రో కార్బన్ ప్రాసెసింగ్ హబ్‌గా రూపొందడం ఖాయమని చెప్పారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రెండు ప్రాజెక్టులను ఏర్పాటుచేస్తామని అన్నారు. వాటికి సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు.

రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపట్టే ప్రాజెక్టులు, కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా ఆ సంస్థ ఈడీ అలోక్‌నందన్‌ను హామీఇచ్చారు. కన్సార్టియం ఏర్పాటు ద్వారా పై రెండు ప్రాజెక్టులను చేపట్టే యోచనతో వున్నట్టు తెలిపారు. ఈ భేటీలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ కూడా పాల్గొన్నారు.

ఈ తరహా పరిశ్రమ ప్రపంచం మొత్తం మీద హూస్టన్‌లోనే వుంది. భవిష్యత్ ఇంథన అవసరాలకు హైడ్రో కార్బన్ ప్రాసెసింగ్ యూనిట్లు అత్యంత అవసరంగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కాకినాడను కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దుతోంది. మరికొన్ని భారీతరహా ప్రాజెక్టులు, సంస్థలు మున్ముందు కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. వీటన్నింటి ఏర్పాటుతో కోస్తాతీరంలో ఒక ముఖ్య పారిశ్రామిక కేంద్రంగా కాకినాడ రూపుదాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

Similar News