KCR : ప్రజాక్షేత్రంలో ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎండగడతాం.. కొట్లాడి కాపాడుకుంటాం

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.

Update: 2025-12-21 13:35 GMT

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివక్షతకు గురయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేరకు కృష్ణా జలాలు పారుతున్నాయని తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే చర్చించామని వెల్లడించారు. మహబూబ్ నగర్ కు తీవ్ర అన్యాయం నాడు జరిగిందని, రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయంపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. రెండు పార్టీలు మహబూబ్ నగర్ జిల్లాకు ద్రోహం చేశాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. బచావత్ ట్రైబ్యునల్ లో ఈ ప్రాంతం నిరాదరణకు గురయిందని భావించి 17 టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు కేటాయించారన్నారు. 1974లో కేటాయిస్తే దానిని పట్టించుకున్నవారు లేరన్నారు.

తట్టెడు మట్టి పోయకుండా...
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తట్టెడు మట్టి పోయలేదని కేసీఆర్ అన్నారు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తాము ఆరు అనుమతులు తీసుకువచ్చామని చెప్పారు. తెలంగాణకు బీజేపీ శనిలా మారిందని కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు మాట విని డీపీఆర్ ను వెనక్కు పంపారని కేసీఆర్ తెలిపారు. నదీజలాల కోసం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కేసఆర్ డిమాండ్ చేశారు. డీపీఆర్ ను వెనక్కు పంపితే భూమిని, ఆకాశాన్ని ఏకం చేయాల్సిన కాంగ్రెస్ మౌనంగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు ప్రాంతానికి ఆరు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. చడి చప్పుడులేదు.. దుకాణం లేదు.. లొల్లి లేదు అన్నారు. ఇంత దద్దమ్మ ప్రభుత్వం మరొకటి లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
త్వరలో బహిరంగ సభలు...
ఇరిగేషన్ సెక్రటరీకి ఈ ప్రభుత్వం నలభై ఐదు టీఎంసీలు ఇవ్వాలని లేఖ రాసిందని కేసీఆర్ మండి పడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం ఉందా? నిద్ర పోతుందా? రియల్ ఎస్టేట్ దందా తప్ప మరొకటి లేదా? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి ఒక్కరూపాయి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు పెట్టలేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరి వత్తిళ్లు దీనిపై ఉందని చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించామని, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను దోచుకు వెళుతున్నా చడీచప్పుడు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రెండు మూడు జిల్లాల్లో ఆయా జిల్లాల్లో నేతలతో సమావేశమై భారీ బహిరంగసభలు పెడతామని కేసీఆర్ చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొట్లాడి కాపాడుకుంటామని అన్నారు.
ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం...
ఈ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామికరంగంలోనూ మంచి పద్ధతిలో పోతున్న రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. శాంతిభద్రతలు లేవన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాష్టీకాలను రెండేళ్లు చూస్తూ ఓపికపట్టామని అన్నారు. ఇక టైం దాటి పోయిందన్నారు. వెయ్యి రూపాయల నుంచి తమ ప్రభుత్వంలో పింఛను ను రెండువేలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసం రోజురోజుకూ కోల్పోతున్నారన్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారడంతోనే తమ ప్రభుత్వహయాంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయతలపెట్టామని అన్నారు. ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ అని ప్రశ్నించారు. హైదరాబాద్ కు నాలుగు వందలేళ్ల చరిత్ర ఉందన్నారు. నగరం భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని చేసిందే ఫార్మాసిటీ అని అన్నారు.


Tags:    

Similar News