రాజమండ్రి సెంట్రల్ జైల్లో మంత్రిగారు ముచ్చట తీర్చుకున్నారు. నిజానికి ఆయన ముచ్చట అక్కడ ఉన్న ఖైదీలకు మరింత కిక్ ఇచ్చేదే! వారు చేస్తున్న పనికి మరింత ప్రోత్సాహం ఇచ్చేదే. కాకపోతే.. ఈ సెంట్రల్ జైల్లో జరుగుతున్న మంచి ప్రయత్నాన్ని కేవలం ముచ్చటలాగా తీసుకోకుండా.. మంత్రిగారు దాన్ని ఓ విధానంలా తీసుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందేమో.
ఇంతకూ విషయం ఏంటంటే.. రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప గాంధీజయంతి సందర్భంగా ఖైదీలకు పండ్లు, మిఠాయిలు తినిపించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడి ఖైదీలు తయారుచేస్తున్న దుస్తులను ప్రదర్శనకు ఉంచడంతో వాటిని చూసి, సెభాష్ చాలా బాగా చేస్తున్నారంటూ మెచ్చుకున్నారు. మంత్రిగారి మెచ్చుకోలు సహజంగానే ఖైదీలకు కిక్ ఇచ్చింది. దానికి తోడు, ఖైదీల మేకింగ్ నచ్చిన మంత్రి తనకు కూడా దుస్తులు కుట్టాలంటూ వారికి కొలతలు కూడా ఇచ్చారు. అదేదో సామెత చెప్పినట్టుగా స్వబుద్ధి కంటె అనుసరించే తత్వమే అధికంగా ఉండే మన నేతలు.. ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వంటి వారు కూడా ఖైదీలకు కొలతలు ఇచ్చేశారు.
అయినా.. ఇప్పుడీ ఖైదీల దుస్తుల తయారీ వ్యాపారాన్ని పెంచినట్టే.. మంత్రివర్యులు చేనేతగానీ, ఇంకా బతికి ఉన్న కొన్ని చేతి వృత్తుల్ని గానీ పట్టించుకుంటే బాగుంటుంది. మంత్రిగారు ఈ సంఘటన మాదిరిగానే.. అప్పుడప్పుడూ చేనేత గ్రామాలు తిరిగి అక్కడి కార్మికులు నేసిన దుస్తులు కొని, ప్రోత్సహిస్తే.. మంత్రిగారి వెంబడి పోలోమని అనుచరులంతా కొంటారు. అలాంటి వాతావరణం ఏర్పడితే.. ఇక చేనేత కార్మికుల వంటివి అసలుండవు.
అయినా వృత్తుల ప్రోత్సహించడం అనేది ఆపద్ధర్మంగా ఇలా అనుకోకుండా తటస్థించేదిగా కాకుండా, అదొక విధానంగా నాయకులు భావిస్తే.. ఆయా రంగాల్లో వారికి నిజంగానే చాలా మేలు జరుగుతుంది.