సహనానికి కొంత హద్దు ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరామ్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కొలువుల కోసం కొట్లాట సభలో ఆయన ప్రసంగించారు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. హోంగార్డులను రెగ్యులరైజ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ మేమే తెచ్చాం...మేమే...తెచ్చాం అని చెప్పుకుంటున్న వారు రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం చేసిన వారి ముందు ఎంత అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతోందని, అందులో తెలంగాణలో ఎంతమంది ఉన్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఉద్యోగాల్లోనూ స్థానికులకు 80 శాతం అవకాశం ఇవ్వాలన్నారు. నిరుద్యోగ సమస్యపై తమ పోరాటం కొనసాగుతుందని కోదండరామ్ తేల్చిచెప్పారు. ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగ యువత, విద్యార్థులు తరలి వచ్చారు.