Strait of Hormuz : హార్మోజ్ జలసంధి మనకు చారిత్రాత్మకమైనదట

హార్మోజ్ జలసంధి గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తుంది

Update: 2026-04-06 03:12 GMT

హార్మోజ్ జలసంధి గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తుంది. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఆరోవారానికి చేరుకుంది. అయితే హార్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ నౌకలను అడ్డుకోవడంతో చమురు ముడి ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ హార్మోజ్ జలసంధి తెరవాలంటున్నాయి. అయితే హార్మోజ్ జలసంధి గతంలోనే మన పూర్వీకులు వినియోగించేవారని పెద్దలు చెబుతున్నారు. హర్మోజ్ జలసంధినే మన పూర్వీకులు, కవులు "హురుమంజి" లేదా "హొరమంజి" అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్య కాలం నాటి కావ్యాలు, ఈ హురుమంజి నుండి జరిగిన వర్తకాన్ని చాలా గొప్పగా వర్ణించాయి.అక్కడి నుంచి ఆంధ్రదేశానికి ప్రధానంగా దిగుమతి అయ్యే వస్తువులు ఇవేనట.

హురుమంజి గుర్రాలు...
మధ్యయుగంలో రాజులు, కాకతీయులు, ఆ తర్వాత విజయనగర రాయలకు యుద్ధాలలో గెలవాలంటే మంచి జాతి గుర్రాలు కావాలి. అరేబియా మరియు పర్షియా (ఇప్పటి ఇరాన్) నుండి వచ్చే మేలుజాతి అశ్వాలు ఈ "హురుమంజి" రేవు నుండే ఓడల ద్వారా మన కోస్తా తీరానికి అంటే మోటుపల్లి, మచిలీపట్నం, భత్కల్ కు వచ్చేవి. శ్రీకృష్ణదేవరాయలు తన "ఆముక్తమాల్యద" లో గుర్రాల వ్యాపారం గురించి రాస్తూ, "రేవులను అభివృద్ధి చేసి, హురుమంజి నుండి వచ్చే గుర్రాలు, ఏనుగులు శత్రువులకు దక్కకుండా మనకే దక్కేలా చూసుకోవాలి" అని రాజనీతిని బోధించారు.
శ్రీనాథుని హరవిలాసంలో...
కవిసార్వభౌముడు శ్రీనాథుడు రాసిన "హరవిలాసం" లో అవచి తిప్పయ్య సెట్టి అనే గొప్ప వర్తకుడి గురించి వర్ణిస్తూ, అతను ఏ దేశం నుంచి ఏ వస్తువులు తెచ్చేవాడో ఒక సీస పద్యంలో అద్భుతంగా చెప్పాడు. అందులో హురుమంజి ప్రస్తావన ఉంది."హురుమంజి సొగసు కైవడి బారువారముల్."అంటే, హురుమంజి నుంచి అందమైన, వేగంగా పరుగెత్తే గుర్రాలను తెప్పించేవాడని అర్థం.
ఇతర వస్తువులు...
గుర్రాలే కాకుండా, హురుమంజి నుండి విలాసవంతమైన వస్తువులు కూడా వచ్చేవి. ముత్యాలు, పన్నీరు, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, అక్కడి నుంచి నాణ్యమైన ముఖమల్ వస్త్రాలు కూడా వచ్చేవి. హార్మోజ్ జలసంధి అంటే మన తెలుగు వారికి కేవలం ఒక చమురు రవాణా మార్గం మాత్రమే కాదు. ఒకప్పుడు మన రాజ్యాల సైనిక బలానికి (గుర్రాలు), రాణుల అలంకరణకు (ముత్యాలు, పన్నీరు) మూలకేంద్రం అదే. ఆనాటి మన వర్తకులు సముద్రం మీద ఆధిపత్యం చెలాయించి, అక్కడి నుండి సంపదను మన దేశానికి తెచ్చేవారని చెబుతున్నారు.


Tags:    

Similar News