Chandrababu : చంద్రబాబు హింట్ ఇచ్చారుగా.. ఇక సర్దుకోండి సార్లూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశారు. తరచూ వివాదాల్లో ఇరుక్కునే ఎమ్మెల్యేలు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారని చెప్పారు. అంటే ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేశారు. ఏమాత్రం వివాదాల్లో ఇరుక్కున్నా తాను టిక్కెట్ ఇచ్చేది లేదని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పటికిప్పుడు చర్యలు ఉండకపోవచ్చు. కానీ భవిష్యత్ లో మాత్రం వారికి టిక్కెట్ ఇచ్చే విషయంలో ఈ వివాదాలన్నీ కౌంట్ అవుతాయని చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పకనే చెప్పేశారు. ఎన్ని సార్లు చెప్పినప్పటికీ వారు చెవికెక్కించుకోకపోవడంతో పాటు ఇంకా ఎమ్మెల్యేలు రెచ్చిపోతుండటంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు.
వరస వివాదాల్లో...
ఇటీవల టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనేక మంది అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇప్పటి వరకూ చాలా మంది ఎమ్మెల్యేలు గీత దాటినట్లు చంద్రబాబుకు స్పష్టంగా అర్థమయింది. వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ అయితే తీసుకున్నారు కానీ, సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయకపోనంత మాత్రాన చేతకాని తనం అని చూస్తూ ఊరుకోవద్దని అన్నారు. గీత దాటితే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పారు. అలాగే వైఖరి కొనసాగితే సింగిల్ టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని హింట్ ఇచ్చారు.
వీరికి టిక్కెట్లు కష్టమేనట...
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుల్ నజీర్, నరసరావు పేట ఎమ్మెల్యే అరవింద బాబు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం లుమాత్రం ట్రబుల్ లో ఉన్నట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెను వెంటనే వీరిపై చర్యలు తీసుకోకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో వీరి స్థానంలో కొత్త నేతలకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయినట్లు తెలిసింది.ఎవరు తోక జాడించినా.. ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం లేదు కానీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం టిక్కెట్ లభించదన్నది స్పష్టంగా చంద్రబాబు చెప్పినట్లయింది. ఇప్పటికైనా ఎమ్మెల్యేల్లో మార్పు వస్తుందా? లేదా?అన్నది చూడాల్సి ఉంది.