Hyderabad : ఆసుపత్రులన్నీ కిటకిట.. హైదరాబాద్ పై దోమల దాడి
హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయింది.
హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయింది. ఇటీవల కాలంలో దోమలు జనం పై దాడి చేస్తున్నాయి. దోమల కారణంగా అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఎండాకాలంలో సహజంగా దోమలు తక్కువగా ఉంటాయి. అయితే ఈసారి మాత్రం దోమలు ఎండకాలంలోనూ వదలడం లేదు. దీంతో చికెన్ గున్యా, డెంగీ, జ్వరం వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే కాకుండా జలులు, వైరల్ ఫీవర్ వంటి కేసులు అధికంగా వస్తున్నాయని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం చెబుతుంది.
ఆసుపత్రులు రోగులతో కిటకిట...
అనేక ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ చికెన్ గున్యా, డెంగీ, విషజ్వరాలతో వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. అసలే ఉక్కపోతతో ఉన్న ప్రజలకు జ్వరంతో పాటు అనారోగ్యం పాలయి ఆసుపత్రికి చేరి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఇటీవల ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దోమల బెడద ఎక్కువగా ఉందని విన్నూత్న తరహాలో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ అంతటా...
హైదరాబాద్ అంతటా ఈ సమస్య ఉందన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు సరైన విధంగా ఫాగింగ్ చేయకపోవడం, చెత్త తొలగించకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దోమల బెడద కారణంగా...డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధపడుతున్నారు. అడపాదడపా వానలు పడుతుండటం వల్ల దోమల తీవ్రత ఎక్కువవుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.