విపక్షం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేప్పుడు కనీసం అందులోనైనా నిర్దిష్టత ఉండాలి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి గనుక.. ఏదో కాస్త వ్యతిరేకిస్తూ, విధానాల్లో లోపాల గురించి, విధానాలను ఎలా చక్కదిద్దాలనే అంశాల గురించి పట్టించుకోకుండా పోరాటం జరిపితే.. అలాంటివి మొక్కుబడి పోరాటాలుగా మారుతాయే తప్ప.. ఫలితం సాధించే దిశగా అడుగు పడదు. తెలంగాణలో ప్రస్తుతం విపక్షాల్లో చాలా మందికి ఎదురవుతున్న సమస్య ఇదే. కాంగ్రెస్, తెదేపాలు ఒక తరహా పోరాటాలు చేస్తోంటే.. తద్భిన్నంగా.. మద్యం వ్యాపారం విషయంలో కేసీఆర్ సర్కారు విధానాల్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ సాగిస్తున్న పోరాటానికి ఒక స్పష్టత లేకుండా పోయినట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సీనియర్ నాయకుల్లో ప్రొఫెసర్ శేషగిరి రావు ఒకరు. జనంలో చెలామణీ అయ్యే నాయకుల్లాగా పాపులర్ కాకపోయినప్పటికీ.. మేధావిగా భాజపా విధాన నిర్ణేతల్లో ఒకరిగా ప్రొఫెసర్ శేషగిరిరావుకు గుర్తింపు ఉంది. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు మద్యం వ్యాపారం విషయంలో అనుసరిస్తున్న ధోరణులకు వ్యతిరేకంగా, మద్యనిషేధం కోరుతూ ఆయన 24 గంటల నిరాహార దీక్ష చేశారు. ఆయన పార్టీలో పెద్ద నాయకుడు గనుక.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ఇలా.. సీనియర్ నాయకులంతా ఆ దీక్షలో ఆయనకు మద్దతుగా కూర్చున్నారు. కానీ.. ఈ దీక్ష మరియు పోరాటం ద్వారా భాజపా వాస్తవంగా ఏం డిమాండ్ చేస్తోంది అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడి అసలు పోరాటానికి విలువ లేకుండా చేశారు.
అసలు దీక్షకు కూర్చున్న శేషగిరిరావు డిమాండ్ మద్యనిషేధం. తెలంగాణలో మద్యప్రియత్వం శృతిమించి.. పట్టపగలే కాలేజీ కుర్రాళ్లు మద్యం సేవించి.. రోడ్డు ప్రమాదాలు అమాయకుల మరణాలకు కారణమవుతుండడం.. ఆయనను ప్రధానంగా కలచివేసి దీక్షకు పురిగొల్పిన విషయం. తన చుట్టుపక్కల సమాజంలో సుమారు 30 వేల మంది విద్యార్థులు ప్రతిరోజూ మద్యం సేవించి పాడైపోతున్నారనేది ఆయన ఆవేదన. ఆయన మద్య నిషేధం కోరుతూ దీక్ష చేశారు. అయితే ఆయనకు మద్దతుగా కూర్చున్న పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితర నేతల ధోరణి వేరు. నిషేధం డిమాండ్ చేసేంత ధైర్యం వారికి లేదు. ఆ ఉద్దేశం కూడా లేదు. మద్యం వ్యాపారానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని, హాపీ అవర్స్ లాంటివి అందుబాటులోకి తెస్తోందని.. మాత్రమే వారు విమర్శలు చేశారు. నిషేధం కోరడం గానీ, రాష్ట్ర వ్యాప్తంగా విధానాల్లో రావాల్సిన మార్పు గురించి గానీ వారు ఫోకస్ పెట్టలేదు. పైగా శేషగిరిరావు కోసం వచ్చినట్లుగా ఉన్నది తప్ప.. పార్టీ పరంగా ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించి.. మద్యం విధానాల్లో మార్పులు తేవడానికి పోరాడుతాం అనే ప్రతిజ్ఞలు కూడా ఏమీ లేవు. ఇలా భాజపా వారి పోరాటం తలో రకంగా చీలికలుగా సాగింది. ఇలాంటి చీలికల పోరాటాలు ప్రభుత్వానికి బలంగా మారుతున్నాయే తప్ప.. ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేలా ఉండడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.