Andhra Pradesh : ఆశాకిరణ్ ఎంట్రీతో ఏపీలో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటాయా?
ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి కుటుంబంలో ఆశాకిరణ్ యాక్టివ్ అవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి కుటుంబంలో ఆశాకిరణ్ యాక్టివ్ అవుతున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 26వ తేదీన కాపునాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వంగవీటి ఆశా కిరణ్ నిర్ణయం కుటుంబ సభ్యులతో పాటు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. రంగానాడు పెట్టడానికి గల కారణాలు ఏంటన్న దానిపై అనేక రకాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. దీని వెనక వైసీపీ నేతలున్నారంటూ ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరొకవైపు కేవలం రంగా ఆశయాలను సాధించడానికే తాము ఈ రంగానాడును నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద విశాఖలో మరో మూడు రోజుల్లో రంగానాడు మరోసారి ఏపీ రాజకీయాలను హీటెక్కించింది. విశాఖ బీచ్ రోడ్డులో లక్షలాది మంది హాజరయ్యేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
అకస్మాత్తుగా ఎంట్రీ కాదు...
ఆశా కిరణ్ ప్రవేశం ఆకస్మాత్తుగా జరిగింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆశా కిరణ్ క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నారు. తన తండ్రి రంగా ఆశయాలను, సిద్ధాంతాలను నిలబెట్టడమే కాకుండా రంగా అభిమానులకు అండగా నిలిచేందుకు మాత్రమే తాను అడుగులు వేస్తున్నట్లు ఆశాకిరణ్ ప్రకటించారు. వంగవీటి రంగా జీవించి ఉన్న సమయంలో రాధా రంగా మిత్రమండలి, యునైటెడ్ ఇండిపెండెంట్స్ (యు ఐ) సంస్థలను పునర్మిస్తానని ఆశాకిరణ్ చెబుతున్నారు. అలాగే రంగా అభిమానులకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా ఆశాకిరణ్ ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆమె పదే పదే చెబుతున్నారు.
రాజకీయాలతో సంబంధం లేదని...
తనకు వైసీపీతో కాని, తెలుగుదేశం పార్టీతో కానీ సంబంధం లేని ఆశాకిరణ్ చెబుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కాపు సామాజికవర్గానికి ప్రతీకగా నిలిచే రంగా పేరిట కార్యక్రమాన్ని అదీ ఉత్తరాంధ్ర అయిన విశాఖపట్నంలో నిర్వహిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రంగాకు ఇప్పటికీ కులాలు, మతాలకు అతీతంగా అనేక మంది అభిమానులున్నారు. రంగా పేదల పక్షపాతి. ఆయన పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసి ప్రాణాలు వదిలారు. అందుకే ఇన్ని దశాబ్దాలయినా రంగా పేరును ఏపీ ప్రజలు విస్మరించలేదు. జనరేషన్లు మారినా రంగా పేరు మాత్రం ఇంకా వినపడుతూనే ఉంది. అయినా ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ సమయంలో రంగానాడును కూడా రాజకీయం తగదని పలువురు రంగా అభిమానులు సూచిస్తున్నారు. రంగా ఆశయాలను, సిద్ధాంతాలను స్మరించుకోవడం కోసమేనని చెబుతున్నారు.