Pawan Kalayn : తాట తీస్తా.. తోలుతీస్తా.. మళ్లీ శపథాలెందుకు... జోగయ్యను అడుగు జానీ?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు.

Update: 2025-12-23 08:09 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ కొంత మౌనంగా, హుందాగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాను మరిచిపోయి తాట తీస్తా.. తోలు వలుస్తా అంటూ హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నారు. అందుకు తన ప్రభుత్వాన్ని సమర్థించుకుంటే తప్పులేదు కానీ.. మళ్లీ ఇక వైసీపీని రానివ్వబోనని శపథం చేయడం ఎందుకని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తన ఊపిరి ఉండగా జగన్ సీఎం కాలేడంటూ శపథం చేసినప్పటికీ 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుకు తెస్తున్నారు.

నిజాయితీగా ఉన్నప్పటికీ...
నిజానికి పవన్ కల్యాణ్ ఆవేశపరుడు. అలాగే నిజాయితీగా తాను ఉండాలనుకుంటాడు. వైసీపీ అధినేతలు నిజంగా తప్పు చేసి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆయనకు ఎటువంటి ఆటంకాలు.. అడ్డంకులు ఉండవు. కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలకం కాబట్టి జగన్ తో పాటు ఎవరినైనా అరెస్ట్ చేసి లోపల పడేయాలంటూ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ పదే పదే వైసీపీ నేతలను బహిరంగంగా వార్నింగ్ లు ఇస్తుండటం కొంత పార్టీకే ఇబ్బందికరంగా మారింది. ఏదైనా చేతల్లో చూపాలని, అంతే తప్ప ఊరికే అరుపులతో ఉద్ధరించేది ఏమీ ఉండదని కొందరు హితవు పలుకుతున్నారు. అంతా బాగుంటే భవిష్యత్ లో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆయనను కిందకు చేరుస్తాయమేయోనన్న ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తుంది.
హుందాగా వ్యవహరించాలని...
ఇటీవల నిడదవోలు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలోనూ, తాజాగా మంగళగిరిలో జరిగిన జనసేన నేతల పదవీ - బాధ్యతల కార్యక్రమంలోనూ ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. 2019 కంటే ముందు.. 2024 వరకూ ఆయన ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అభిమానులకు ఆనందం కలగవచ్చేమో కానీ, చూసేవారికి, వినేవారికి మాత్రం వెగటుగా అనిపిస్తాయి. రానివ్వకపోవడానికి ఎవరికి ఎవరు? ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా గెలవచ్చు. ఎవరైనా ఓటమి పాలుకావచ్చు. తాను శపథం మళ్లీ మళ్లీ చేసి అందరి దృష్టిలో నవ్వుల పాలు కావద్దంటూ పవన్ కల్యాణ్ కు సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా సూచిస్తున్నారు. పదవికి తగిన హుందాతనాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. మరి పవన్ కల్యాణ్ లో ఇటీవల ఈ ఫ్రస్టేషన్ ఎందుకన్నది ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.
జోగయ్య లేఖతో...

కూటమి ప్రభుత్వానికి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. మొత్తం 45 అంశాలతో కూడిన లేఖను చేగొండి హరిరామజోగయ్య రాశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను రెండేళ్లవుతున్నా అమలుచేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనిఫేస్టోను ఇద్దరు ప్రకటించారని,వారి మాటలను నమ్మి ప్రజలు గెలిపించినా వాటిని అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు.



Tags:    

Similar News