Tirumala : తిరుమలకు వెళుతున్నారా.. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి.. క్యూ లైన్ ఎక్కడ వరకూ అంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారమయినా ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు అప్రమత్తమై భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి వరకూ సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ ఒక్కసారిగా తిరుమలలో పెరిగింది. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది. గోవింద నామ స్మరణలతో మాడ వీధులు మారుమోగిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో భక్తుల సందడితో తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా నేడు విఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవలను తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు రద్దు చేశారు. దీంతో పాటు నేడు ఆన్ లైన్ లో మార్చి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు శ్రీవారి అంగప్రదిక్షణ టోకెన్లను విడుదల చేయనున్నారు. ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది.
అన్ని కంపార్ట్ మెంట్లు..
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులతో కూడిన లైన్ బయట ఏటీజీహెచ్ వరకూ విస్తరించింది. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,764 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,077 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.