సంగీత సరస్వతి మంగళంపల్లి బాలమురళీ కృష్ణకు దేశంలోని అత్యున్నత పౌరపుస్కారం భారతరత్నను ప్రదానం చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. తాజాగా మాజీ కేంద్రం మంత్రి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి.. మంగళంపల్లికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ఒక లేఖ రాశారు. కర్ణాటక సంగీత సాధనలో దేశం గర్వించదగినంతటి అపూర్వమైన కృషి చేసిన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 72 యూనివర్సిటీలనుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ సంగీత ప్రియుల్లో ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఆయన మరణానంతరం, ఆ డిమాండ్ ఇంకా పెరుగుతోంది.
మంగళవారం నాడు తుదిశ్వాస విడిచిన మంగళంపల్లికి బుధవారం చెన్నైలో అంత్యక్రియలు జరిగాయి. సంగీత, సినీ, కళా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా మంగళంపల్లికి భారతరత్న ప్రదానం చేయాలనే డిమాండ్ అక్కడి ప్రముఖుల మధ్య చర్చకు వచ్చింది.
మంగళంపల్లికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఎన్నడో లభించాయి. ఇక మిగిలినదెల్లా భారతరత్న ఒక్కటే.
ఈ నేపథ్యంలో ఆయన ‘మనకు భారతరత్న ఇచ్చేశారంటే గనుక ఇక మన పని అయిపోయినట్లే అనే భావన వస్తుంది. మనం ముసలివాళ్లం అయిపోయాం అనే భావన కలుగుతుంది’ అంటూ సరదాగా ఆ పురస్కారం అందుకోవడం గురించి చెణుకులు విసిరేవారుట. ఇప్పుడు ఆయన మరణానంతరం భారతరత్న ప్రకటించాలని పలువురు అభిమానులు కోరుతున్నారు. ఇప్పుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఏ రాష్ట్రప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వడం గురించి కేంద్రానికి సిఫారసు చేస్తుందో, ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.