భక్తకోటికి ముక్తి ప్రదాయకుడైన శ్రీహరి సర్వసైన్యాధ్యక్షుడు, చతుర్భుజుడు అయిన విష్వక్సేనుడు.. స్వామివారి బ్రహ్మూెత్సవాలు సోమవారం ప్రారంభం కానున్న సందర్భంగా.. ఆదివారం సాయంత్రం తిరుమల ఆలయ మాడ వీధుల్లో వైభవోపేతంగా ఊరేగారు. తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలకు అంకురారోపణ జరిగే రోజున.. స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు అయిన విష్వక్సేనుల వారు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించడానికా అన్నట్లు, సకల సంరంభ సమేతులై ఊరేగడం అనేది ఆనవాయితీ. అదే సమయంలో.. సకల దేవాది దేవతలను కూడా బ్రహోత్సవాలకు ఆహ్వానిస్తారని ప్రతీతి.
ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ఉత్సవంలో విష్వక్సేనుల వారు సకలాభరణ భూషితులై, గజ తురగ పదాతిదళాల వైభవ పటాటోపాలు వెంట వస్తుండగా.. ఠీవిగా తిరుమాడ వీధుల్లో భక్తకోటికి కన్నుల పండుగగా ఊరేగడం విశేషం.
బ్రహ్మూెత్సవాల సందర్భంగా తిరుమలను అత్యంత అద్భుతంగా అలంకరించారు. ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లి విరుస్తోంది. స్వామివారి అవతారాలను, శ్రీవారు, అమ్మవార్ల మూర్తులను విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన భారీకటౌట్లను అనేక చోట్ల ఏర్పాటు చేశారు. తిరుమల దేవస్థానాల ఉద్యానశాఖ వారు వేలాడే ఉద్యానవనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. విష్వక్సేనుల వారి ఊరేగింపు అనంతరం.. అంకురారోపణ కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. సోమవారం ధ్వజారోహణంతో ఉత్సవ వైభవం శ్రీకారం దిద్దుకుంటుంది.