అమరావతిని కాలుష్యరహితంగా రూపొందించాలన్న ఆలోచనలో భాగంగా 1620 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా సైకిల్ ట్రాకులను రూపొందిస్తున్నారు. నిజానికి ఇది సైకిళ్ల వినియోగంలో ప్రఖ్యాతి గాంచిన డెన్మార్క్ రాజధాని కోహెన్ సెగన్‌లోని సైక్లింగ్ ట్రాక్ నెట్‌వర్క్ కంటె చాలా ఎక్కువ. సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుపై దీనిపై ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్‌తో ఇప్పటికే అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అయితే సర్కారు సైకిళ్ల వినియోగాన్ని పెంచడానికి చేస్తున్న కసరత్తును సమర్థించాల్సిందే గానీ.. సైకిల్ ట్రాక్ లు సంపన్నులు తిరిగే ఖరీదైన సైకిళ్లకు, వారి అవసరాలకు మాత్రమే పరిమితమైనట్లుగా ఉంటాయా? కూలిపనులకు వెళ్లే సామాన్యులు కూడా తమ సొంత సైకిళ్లను వాడుకునేందుకూ ఉపకరిస్తాయా? అనేది స్పష్టత లేదు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వెలగపూడి సచివాలయంలో సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు ఫెడరేషన్ చైర్మన్ డీవీ మనోహర్ చెప్పారు. 43 కిలోమీటర్ల మేర వున్న వెలగపూడి సచివాలయంలో పబ్లిక్ బైక్ షేరింగ్ విధానంలో బైసైకిలింగ్ ట్రాక్స్ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. వంద సైకిళ్లు, 6 బైక్ స్టేషన్లను మూడు మాసాల వ్యవధిలోగా వెలగపూడిలో సిద్ధంచేస్తున్నామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. వెలగపూడిలోనే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలలో సైకిల్ ట్రాక్స్ వెంటనే ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విజయవాడలో ప్రధాన కాలువల వెంబడి వున్న మార్గాలలో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుచేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు.
బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ సర్కిల్ వరకు సర్విస్ రోడ్డు పక్కనే సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఈ మార్గాలలో ఇ-బైక్‌లను కూడా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి పరిధిలో కాలుష్యం చాలా పరిమితంగా ఉండేలా డీజిల్ వాహనాలు బాగా తగ్గేలా , ఈ-వాహనాలు పెరిగేలా కూడా దృష్టి పెడుతున్నారు.