వెటకారపు వ్యాఖ్యల్లో టాప్‌మోస్ట్‌ ఇదేనేమో!

Update: 2016-09-24 03:18 GMT

రాజకీయ నాయకులు తరచూ తమ ప్రత్యర్థులను విమర్శించడంలో.. ఆచరణ సాధ్యం కాని అతిశయోక్తి విమర్శలు చేస్తుంటారు! ప్రాక్టికల్‌గా సాధ్యం కాని మాటలు వల్లిస్తూ ఉంటారు. 'చంద్రబాబు మధ్యంతర ఎన్నికలకు వెళితే.. హోదా వస్తుంది' లాంటి డైలాగులు ఇలాంటివే. ఇలాంటివి తరచూ మనకు వినిపిస్తూ ఉంటాయి. పైగా ప్రజలు కూడా వీటికి బాగా అలవాటు పడిపోయారు.

అయితే రాష్ట్రం విడిపోవడం అంతా అయిపోయిన తర్వాత.. అప్పటి ఘటనల గురించి చరిత్రపుస్తకాలు రాసుకుని, ఆ టాపిక్‌ మీద క్రేజ్‌ సంపాదించాలని చూస్తున్న మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ ఇప్పుడు తెలంగాణకు చెందిన మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో సున్నం పెట్టుకున్నారు. వీరిలో ఒకరు ఆంధ్రా మేధావి అయితే మరొకరు తెలంగాణ మేధావి నాయకులు అనడంలో సందేహం లేదు.

విభజన కథ అంటూ ఉండవిల్లి ఓ పుస్తకం రాస్తే.. అందులో ఉన్నవన్నీ కట్టుకథలే అని జైపాల్‌రెడ్డి కొటి ్టపారేశారు. ఆ మాటకొస్తే జైపాల్‌ మాటలకు కూడా జనంలో పెద్ద క్రెడిబిలిటీ లేకపోయినప్పటికీ.. జైపాల్‌ ఢిల్లీలో ఎన్నిరకాల తెరవెనుక రాజకీయాలకు పాల్పడ్డారో అవన్నీ ఏకరవు పెడుతూ.. ఉండవిల్లి ఎదురుదాడికి దిగుతున్నారు. నావి కట్టు కథలైతే , అసలు కథలు మీరు చెప్పాలని సవాలు విసురుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు. ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి మేలు జరగాలంటే ఉండవిల్లి ఒక సలహా ఇస్తున్నారు. అసలు కామెడీ వెటకారం అందులోనే ఉంది. ప్రస్తుతం రాబోతున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రత్యేకహోదా అడుగుతున్న జగన్‌, పవన్‌, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు అందరూ కలిసి.. తెదేపా-భాజపా కూటమిపై పోటీచేస్తే ప్రయోజనం ఉంటుందని, ప్రజాగ్రహం పాలక పక్షానికి తెలిసి వస్తుందని అంటున్నారు. ఆయన సలహా సబబుగానే ఉండొచ్చు. కానీ.. పరస్పర వైరి ధ్రువాల వంటి జగన్‌- పవన్‌ కల్యాణ్‌.. పొత్తుల కోసం వెళితే గొంతెమ్మ కోరికలు కోరే వామపక్షాలు, క్రెడిట్‌ మొత్తం తమకే కావాలనుకునే కాంగ్రెస్‌ ఇలాంటి వారంతా ఐక్యం కావడం సాధ్యమేనా అని జనం నవ్వుకుంటున్నారు.

Similar News