Ys Jagan : కొత్త ఏడాదిలోనైనా జగన్ నిర్ణయం తీసుకుంటారా?
కొత్త ఏడాదిలోనైనా వైసీపీ అధినేత జగన్ లో మార్పు వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు
కొత్త ఏడాదిలోనైనా వైసీపీ అధినేత జగన్ లో మార్పు వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఏడాది వైసీపీకి కీలకమని చెప్పాలి. అంటే ఈ ఏడాది తర్వాత మరో రెండేళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంటుంది. జగన్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడే క్యాడర్ ఇప్పుడు కనిపించడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీని క్యాడర్ ప్రాణం పెట్టి కాపాడుకుంది. కానీ 2024 ఎన్నికల నాటికి వచ్చే సరికి పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడే వారు లేకపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థులు గట్టిగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే ఎంతో కొంత క్యాడర్ ఉంది. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో క్యాడర్ చేతులెత్తేసింది.
గత ఎన్నికల సమయంలో...
దీనికి ప్రధాన కారణం నేతలను నియోజకవర్గాలను మార్చడం కూడా అని చెబుతున్నారు. జగన్ ఏకపక్షంగా సర్వే నివేదికలను నమ్మి ఇష్టారీతిన నాయకులను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు. కానీ బదిలీ చేసిన ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ఒక్క నేత కూడా గెలవలేదు. ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందన్న కారణంగా నేతలను మార్చినా.. వారు అక్కడకు వెళ్లి క్యాడర్ ను కలుపుకునే సమయం లేకపోవడం కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారిందన్న విశ్లేషణలు బలంగా వినిపించాయి. అందుకే ఈసారి జగన్ ఈ ఏడాది నియోజకవర్గాల ఇన్ ఛార్జుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడుతున్నారు. మరొకవైపు కొత్త ఏడాదిలో జగన్ చుట్టు ఉన్న కేసులు కూడా తేలి ఆయన ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తుంది.
ఆలస్యం చేస్తే అంతే...
ఎన్నికలకు ముందు తీసుకునే నిర్ణయాలు చాలా వరకూ వికటించే అవకాశాలుంటాయి. అందులో ప్రతిపక్షంలో ఉండటంతో ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచి నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ ఇటు క్యాడర్ లోనూ, అటు ప్రజల్లోనూ మంచి పేరు తెచ్చుకోవాలంటే జగన్ ఈ ఏడాది ఇన్ ఛార్జులను నియమించుకుని వారే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులని పరోక్షంగా చెప్పాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో ఒకటి అరా మార్పులున్నప్పటికీ కూటమి ప్రభుత్వంపై వచ్చే అసంతృప్తి తమకు గెలుపు ఖాయమని ధీమాగా ఉంటే రెండోసారి కూడా అపజయాన్ని మూటగట్టుకునే వీలుందని అంటున్నారు.అందుకే జగన్ ఇప్పటికైనా అతి విశ్వాసానికి పోకుండా ఈ ఏడాది నిర్ణయాలను అది ఏ రూపంలోనైనా తీసుకుంటేనే ఒడ్డున పడతారు. లేకుంటే..మళ్లీ అధికారానికి దూరం కాక తప్పదు.