Andhra Pradesh : "సూపర్" సిక్స్ అని సంబరపడితే సరిపోదు సామీ.. ఫీల్డ్ లో ఏం జరుగుతుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలు అంత సులువుగా కనిపించడం లేదు

Update: 2025-12-31 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలు అంత సులువుగా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు మాత్రమే అయినా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే అంత ఆశాజనకంగా లేదు. సూపర్ సిక్స్ అమలు చేశామంటూ కూటమి నేతలు సంబరపడిపోతున్నా అదే చివరకు రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయంటున్నారు. పింఛన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకుంది. కానీ అదే సమయంలో అనేక మందిని పింఛన్ల నుంచి తొలగించింది. ఈ మాట ఎవరో అనడం లేదు. తాడిపత్రికి చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియాలో తన తల్లికి ఈ ప్రభుత్వంలో పింఛను అందలేదని పోస్టు పెడుతూ అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఏ స్థాయిలో ప్రజల ఆలోచన ఉందో అర్థం చేసుకోవచ్చు.

పథకం అమలు కాదు...
ఇక దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్ల పథకంపై కూడా మహిళలు అంత సంతృప్తికరంగా లేరు. మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలులోనూ అనేక లోపాలు ఉన్నాయని అంటున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడం, తొలినాళ్లలో చూపిన ఆర్భాటాన్ని తర్వాత పట్టించుకోకపోవడంతో అధికారులు కూడా చూసీ చూడటన్లు వ్యవహరిస్తున్నారు. ఇక వ్యవసాయ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ రెండేళ్లలో అనేక విమర్శలను ఎదుర్కొంది. పంటలకు గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు ఆవేశంతో ఉన్నారు. అదే సమయంలో పండిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోవడం, మరొకవైపు పండిన ఉత్పత్తులకు డిమాండ్ లేక కొనుగోలు చేయకపోవడం కూడా వారి నిరాశకు కారణమయింది.
అన్ని వర్గాల ప్రజలు...
ఇక దిత్వా, మొంథా తుపాను దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్ర ప్రభుత్వం మొంథా తుపాను పరిహారం కింద సాయిం అందిస్తుందని అనుకుంటే మొహం చాటేసింది. దీంతో ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేకపోయింది. అన్న దాత సుఖీభవ పథకం కొందిరికే. తల్లికి వందనం పథకంపై కూడా పెద్దగా కుటుంబాల్లో సంతృప్తి కనిపించడం లేదు. ఇక నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అమలు చేయలేదు. దీంతో యువత కూడా ఇటు ఉపాధి అవకాశాలు లేక, అటు నిరుద్యోగ భృతి అందక తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆల్ ఈజ్ వెల్ అని అధికారుల ఫీడ్ బ్యాక్ తో సంతృప్తి పడితే ఎవరూ ఏమీ చేయలేరు.
అప్పులూ కష్టమే...
ఇప్పటి వరకూ అంటే రెండేళ్లు అప్పులతోనే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం విధ్వంసం అంటూ చెప్పినా జనం నమ్మారు. ఇక ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల తర్వాత కూడా పాత ప్రభుత్వంపై నిందలు వేసి ప్రయోజనం లేదు. అలాగే ఈ ఏడాది కూడా కొత్త అప్పులు పుట్టాలంటే చాలా కష్టమే. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక కొర్రీలు వేస్తున్న విషయాన్ని గమనిస్తే కొత్త ఏడాది చంద్రబాబు పాలనలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెప్పకతప్పదు. ఇప్పటికైనా పాలకులు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి వాటికి చెక్ పెట్టగలిగితేనే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తారన్నది వాస్తవం.


Tags:    

Similar News