Andhra Pradesh : ఏపీని వదలని స్క్రబ్ టైఫస్ వ్యాధి.. రెండు వేల మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ ను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది

Update: 2025-12-31 04:54 GMT

ఆంధ్రప్రదేశ్ ను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. గత కొన్ని రోజుల నుంచి స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేలకు పైగా కేసులు నమోదయినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు మంది మరణించారని కూడా అధికార వర్గాలు వెల్లడించాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి తో అనేక మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతుండటం ఆందోళనకు దారితీస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వరసగా కేసులు నమోదవుతవుతుండటం వైద్య ఆరోగ్య శాఖకు సవాల్ గా మారింది.

చిత్తూరు జిల్లాలోనే అధికంగా...
అయితే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2024లో 514 కేసులకు చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఐదు వందల వరకూ చేరింది. అయితే పేడ పరుగు కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని, గడ్డి వాముల్లోనూ, పొలాల్లోనూ, పశువులకు మేత వేసే సమయంలో కాళ్లకు షూలు, చేతులకు గ్లౌస్ లు ధరించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. పేడ పురుగు కుట్టినట్లు కూడా తెలియకపోవడంతో దానిని చీమ కుట్టినట్లుగానే భావించి చాలా మంది లైట్ గా తీసుకుంటుున్నారు.
తొలినాళ్లలో గుర్తిస్తే...
స్క్రబ్ టైఫస్ వ్యాధి తొలి లక్షణం జ్వరం రావడం. జ్వరం వచ్చిన వెంటనే స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకు వస్తుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు అనిపించిన వెంటనే అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తొలి దశలో పసిగడితే మందులతో వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. అదే వ్యాధి ముదిరితే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. సో.. జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది.


















Tags:    

Similar News