IBomm Ravi : స్టార్ హోటల్స్ లో బస.. పబ్స్ లో చిందు... పసందు.. ఇదీ రవి లైఫ్ స్టయిల్
ఐబొమ్మ రవి కస్టడీ పూర్తయినప్పటికీ అతను పోలీసులకు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది
ఐబొమ్మ రవి కస్టడీ పూర్తయినప్పటికీ అతను పోలీసులకు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సహకరించలేదని తెలిసింది. ఎన్ని రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించినా ఐబొమ్మ రవి మాత్రం నిబ్బరం కోల్పోకుండా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం నిర్భీతిగా.. నిర్భయంగా చెప్పాడని పోలీసులు తెలిపారు. పైరసీ సినిమాల విషయంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన అనంతరం వారే ఆశ్చర్యపోయారు. బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా, పైరసీ సినిమాల ద్వారా దాదాపు పదమూడు కోట్ల రూపాయలను రవి ఆర్జించినట్లు పోలీసులు కనుగొన్నారు.
మూడు కోట్లను మాత్రమే...
కానీ పోలీసులు మాత్రం ఫ్రీజ్ చేసింది కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం రవికి సంబంధించిన ఏడు బ్యాంకు ఖాతాల్లోకి పదమూడు కోట్ల రూపాయల నగదు జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే పది కోట్ల రూపాయలు మాత్రం విదేశాలను చుట్టివస్తూ, పబ్ లో తిరుగుతుండటం, స్టార్ హోటల్ లో బసతో పాటు లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అందుకోసమే అధికంగా డబ్బులు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. తన స్నేహితుల పేరు మీదనే వెబ్ సైట్ లను కొనుగోలు చేసి తన పేరు బయటకు రాకుండా ఇమంది రవి జాగ్రత్తలు తీసుకున్నాడు.
మార్పు కనిపించక...
2019 నుంచి 2023 మధ్య కాలంలో కొన్ని కోట్ల రూపాయలు ఐబొమ్మ రవి ఖాతాలోకి వచ్చి పడ్డాయి. కొత్త కొత్త సినిమాలను పైరసీ చేయడంలో దిట్టగా పేరొందిన రవి వంద డాలర్లు పెట్టి సినిమాలను కొనుగోలు చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడయింది. అయితే తన పేరు బయటకు రాదన్న ధీమాతో కరేబియన్ దీవుల్లో పెద్ద ఆఫీసును ప్రారంభించి అక్కడే సిబ్బందిని కూడా నియమించుకుని పెద్ద నెట్ వర్క్ కు రవి తెర తీశాడని పోలీసులు చెబుతున్నారు. కస్టడీ రిపోర్టులో కూడా ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లను వీఆర్ ఇన్ఫోటెక్ పేర్లతో రిజిస్టర్ చేశాడు. పోలీసులకు సవాల్ గా మారిన రవి లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాను ఈ నేరం చేయలేదని, న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని చెబుతుండటం కొసమెరుపు.