సాధారణంగా రోజుల తరబడి విడవకుండా కురిసే భారీ వర్షాలకు పెద్దగా అలవాటు లేని భాగ్యనగరం ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అల్లాడుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడినుంచే మొత్తం సహాయక చర్యలు, నష్ట నివారణ చర్యలను పర్యవేక్షించడం ప్రారంభించారు. ఢిల్లీనుంచి ఆయన ఫోను లో మంత్రులతోనూ అధికార్లతోనూ మాట్లాడి అవసరమైన ఆదేశాలు స్వయంగా జారీచేశారు. మూడు రోజుల పాటూ భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో.. రెండు రోజుల పాటూ పాఠశాలలు అన్నిటికీ సెలవులు ప్రకటించారు. స్వయంగా సీఎం రంగంలోకి దిగి అధికార యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ.. వ్యవహారం ఎక్కడా అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భారీ వర్షాల కారణంగా.. జనజీవనం స్తంభించిపోయిన మాట నిజమే అయినప్పటికీ.. ఎక్కడా పెను ప్రాణనష్టాలు నమోదు కాలేదు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ గురువారం రోజంతా నగరంలో పర్యటిస్తూనే గడిపారు. గురువారం రాత్రి కూడా ఆయన జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలోనే గడిపారు. మొత్తం జోనల్ అధికారులంతా తమ తమ కార్యాలయాల్లోనే రాత్రంతా అందుబాటులో ఉండాలంటూ మంత్రి కేటీఆర్ ముందే ఆదేశించారు. వర్ష బీభత్సం కారణంగా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తక్షణం స్పందించే ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు నష్టనివారణకు ఉపయోగపడుతున్నప్పటికీ.. నగర జీవనంలో చిన్న సంక్షోభం ఏర్పడితే.. ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడు తేలుతోంది. రోడ్లన్నీ ఎంత దారుణంగా దెబ్బతిన్నాయంటే.. కనీసం ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా సవ్యంగా లేని పరిస్థితి. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాదిలో వేసిన రోడ్లు కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇలాంటి దెబ్బలనుంచి పాలకులు భవిష్యత్తు కు పాఠాలు నేర్చుకుంటే.. ప్రజల జీవితాలు మెరుగు పడతాయి.