Telangana : రేవంత్ సర్కార్ పై గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు ఎలా ఉందంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. అయితే ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేసిందన్న దానిపై కేవలం ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా చూడలేం. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి సాధారణ ఎన్నికల సమయానికి బయటపడుతుంది. రెండేళ్లలో సిక్స్ గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటున్నా ప్రజల్లో మాత్రం పెద్దగా అనుకూలత ప్రభుత్వం పట్ల లేకపోవడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కాంగ్రెస్ మరో పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. తానే ముఖ్యమంత్రిని అని కూడా ప్రకటించుకున్నారు. కానీ 1995 నుంచి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, 2014 తర్వాత విభజన జరిగిన తెలంగాణలోనూ రెండుసార్లు ఒకే ప్రభుత్వం ఏర్పాటయి ఉండి ఉండవచ్చు. మహిళలు, రైతుల్లో అసంతృప్తి ఉంది. నిరుద్యోగులు కూడా సంతృప్తిగా లేరు.
రెండుసార్లు ఖచ్చితంగా అధికారం...
కానీ ప్రజలు ఆ ప్రాతిపదికగా ఓటు వేస్తారనుకోవడం మాత్రం అనుకోవడం ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. 2028 లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన సమయంలో 2026లోకి మరికొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. అంటే చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం. ఏం చేసినా రేపటి నుంచి రెండేళ్లు మాత్రమే రేవంత్ సర్కార్ కు సమయం ఉంది. ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నా, వారికి దూరమవ్వాలన్నా ఈ 2026 మాత్రం కీలకం అని చెప్పాలి. ఇప్పటి వరకూ అయితే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు. లోపల ఉన్న ప్పటికీ నేతలు బయటపడటం లేదు. అయితే 2026 పార్టీ పరంగా కూడా రేవంత్ రెడ్డి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
మిగిలిపోయిన హామీలను...
మరొకవైపు సంక్షేమ పథకాలను వివిధ కారణాలతో అందరికీ అందించలేకపోతున్నారు. గతంలో మాదిరిగా అవినీతి ఆరోపణలు పెద్దగా వినిపించకపోయినప్పటికీ పాలనలో అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరొకవైపు సెంటిమెంట్ తో ప్రత్యర్థులు ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. ఈసారి బీసీల ఓటు బ్యాంకు ఏ పార్టీ గెలుపునకు అయినా కీలకంగా మారనుండటంతో 2026లో రేవంత్ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయమూ ఎన్నికల ఫలితాలపై ప్రతిబింబించక మానదు. అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో మిగిలిపోయిన వాటిని కూడా ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే పార్టీకి నష్టం చేకూరే అవకాశముంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ సర్కార్ కు ఈ ఏడాది అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలత పెరుగుతుందా? అన్నది తేలనుంది.