కమెడియన్ విజయసాయి ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆచూకీ తెలియక పోవడంతో పోలీసుల దర్యాప్తుకి ఆటంకం ఏర్పడింది. నిందితులందరికీ నోటీసులు అందించాలని వారి ఇళ్లకు ఎప్పుడు వెళ్లినా తాళం దర్శనమిస్తోందని అంటున్నారు పోలీసులు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామంటున్నారు. ముగ్గురు నిందితుల సెల్ ఫోన్ డేటాపై ఫోకస్ పెట్టారు జూబ్లిహిల్స్ పోలీసులు.
అడుగడుగునా ఆటంకాలే...
ఈనెల 11న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న కమెడియన్ విజయ్ సాయి కేసులో అడుగడుగునా ఆటంకాలు ఎదురౌతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో, ఎవరిని విచారించాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు జూబ్లిహిల్స్ పోలీసులు. ఇప్పటికే విజయ్ కి సంబంధించిన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న సెల్ఫీ వీడియోలు, ఆడియో రికార్డ్స్ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫోన్ సంబాషణలను సైతం ఎఫ్ఎస్ఎల్ కి పంపారు.
విజయ్ సెల్ఫీ వీడియోనే....
ఆత్మహత్యకు ముందు విజయ్ తన ఫోన్ లో తీసుకున్న సెల్ఫీ వీడియోనే కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. అతని భార్య వనిత, శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్ ఆచూకీ కోసం తెగ గాలిస్తున్నారు. మణికొండలో ఉండే వనిత ఇంటికి పలుమార్లు వెళ్లిన పోలీసులకు చేదు అనుభవాలే ఎదురైనాయి. ఆమె ఇంటికి వెళ్లినప్పుడల్లా తాళం దర్శనమివ్వడమే తప్ప ఎలాంటి సమాచారం తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారికి కూడా తాను ఎక్కడ ఉందో తెలియకుండా జాగ్రత్త పడింది. ముందురోజు సెల్ ఫోన్ లో తాను విచారణకు హాజరౌతానని చెప్పిన వనిత, ఇప్పుడు ఫోన్ కూడా కలవడం లేదని తెలుస్తోంది. ఆమె సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.
మూడు ప్రత్యేక బృందాలు....
ఈ కేసులో ముందుగా వనిత, శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్ లకు పోలీసులు నోటీసులు రెడీ చేశారు. నోటీసులు అందిన తరువాత వారి నుండి స్టేట్ మెంట్ రికార్డు చేసి తదుపరి అరెస్టుల పర్వం మొదలౌతుందని అంటున్నారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వనిత, శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్ లకు సంబంధించిన కాల్ డేటాను సేకరించిన పోలీసులు, వారి అడ్రస్సు కోసం వాటిపై ఫోకస్ పెట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు, విజయ్ సెల్ఫీనే ఈ కేసులో ఎవిడెన్స్ గా మారింది.