IPL 2026 : చెన్నైకు తప్పని ఓటమి.. పంజాబ్ కు రెండో విజయం

చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ కూడా లక్కు కలసి వచ్చినట్లు కనిపించడం లేదు.

Update: 2026-04-04 02:29 GMT

చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ కూడా లక్కు కలసి వచ్చినట్లు కనిపించడం లేదు. వరసగా రెండు ఓటములు చెన్నై ను కుంగదీస్తున్నాయి. ఎంత భారీ స్కోరు చేసినా గెలవలేకపోవడం చెన్నై అభిమానుల్లో నీరసం ఆవహించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై మంచి స్కోరు చేసింది. సంజూ శాంసన్ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అయితే ఆయుష్ 43 బంతుల్లో 73 పరుగులు చేయడంతో పాటు తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 28 పరుగులు చేసి పరవాలేదనిపించాడు.

ధాటిగా ఆడిన చెన్నై
రుతురాజ్ గైక్వాడ్ అవుటయిన వెంటనే కాన్వే కొంత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. రెండు సార్లు క్యాచ్ లు మిస్ కావడంతో ఆయుష్ భారీ పరుగులు సాధించాడు. అనంతరం సర్ఫరాజ్ ఖాన్ వచ్చి కేవలం పన్నెండు బంతుల్లో 32 పరుగులు చేశాడు. చివరిగా శివమ్ దూబె 27 బాల్స్ లో 45 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇరవై ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగులు చేసింది. చెన్నై తన సొంత గడ్డ మీద ఇంత భారీ పరుగులు చేయడంతో అందరికీ చెన్నైదే విజయమని భావించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అనుకున్నారంతా
టార్గెట్ రీచ్ కావడానికి...
కానీ తర్వాత ఛేదనలో పంజాబ్ కింగ్స్ జూలు విదిల్చింది. 209 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సులువుగా ఛేదించగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధశతకంతో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అధిక స్కోరు నమోదైన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో సీఎస్‌కే చేసిన 209 పరుగులను పంజాబ్ సులభంగా ఛేజ్ చేసింది. రన్ రేటు ఎక్కువగా కనిపిస్తున్నా పంజాబ్ ఓపెనర్లు చెలరేగిపోయారు. ప్రియాంశ్ ఆర్య 39, ప్రభ్ సిమ్రన్ సింగ్ 43 పరుగులు చేసి పంజాబ్ కు శుభారంభాన్ని అందించారు. కానోలీ కూడా 36 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇన్నింగ్స్ ను చక్క బెడుతూ విజయం భాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో 18.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలిగింది.



Tags:    

Similar News