Summer Effect : ఇవేమి ఎండలు...పెనం మీద ఉన్నట్లుందిరా మామా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2026-04-03 04:02 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. వేడిగాలులు, ఉష్టోగ్రతలతో పొయ్యి మీద పెనం పై ఉన్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఉంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. పది గంటల నుంచి బయటకు రావాలంటే జనం భయపడి పోతున్నారు. వీలయినంత వరకూ ప్రజలు పగటి వేళ బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమై బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు.

గరిష్టంగా ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. పగటి వేళ కూలీలు, దినసరి కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు.. 16 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వడదెబ్బ తగిలే అవకాశమున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో ఈ జిల్లాలో హీట్ వేవ్స్...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు పలు చోట్ల నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రమంతటా ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని తెలిపింది. ఇప్పటికే విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే మార్చి నెలలో రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం జరిగిందని లెక్కలు చెబుతున్నారు. ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News