ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను నిషేధించడం అనేది ప్రధానంగా నల్లధనం కట్టడిచేయడానికే అయినప్పుడు, ఆ అసలు లక్ష్యానికి అనుబంధంగా.. నిషేధం అమల్లోకి రాగానే ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగాలి కదా.. వారి దాడులు, వారి వెంట పోలీసుల దాడులు తనిఖీలు ముమ్మరంగా జరగాలి కదా.. అని సామాన్యులకు రెండు రోజులుగా సందేహాలు కలుగుతున్నాయి. వారి సందేహాలకు కాస్త సమాధానం చెప్పేలాగా శుక్రవారం నాడు పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు, దాడులు ముమ్మరంగా జరిగాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు బాహుబలి నిర్మాతలపై జరగడం ద్వారా ఐటీ శాఖ తమ పని ప్రారంభించిందని అందరికీ తెలిసి వచ్చింది. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి రాబోయే వారం పది రోజుల్లో ఐటీ దాడులు మరింత పెద్దస్థాయిలో పెద్ద సంఖ్యలో ఉండబోతున్నాయి.
పెద్ద నోట్ల నిషేధం తరువాత తొలి రెండు మూడు రోజుల పాటూ ఎలాంటి యాక్టివిటీ లేకుండా, కేవలం సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ మాత్రమే కూర్చున్న ఐటీ శాఖ అధికారులు.. ఇక రంగంలోకి దిగినట్లే. తొలి రెండు మూడు రోజుల మౌనం ద్వారా ఏమేం గమనించారో.. ఎవరెవరి వద్ద నల్లడబ్బు మూలుగుతున్నట్లుగా తమ తమ అధ్యయనం, సంకేతాల ద్వారా తెలుసుకున్నారో.. ఆయా నల్లకుబేరులందరి మీద వరుసగా దాడులు చేయబోతున్నారు. నల్లకు బేరులు ఇప్పటికిప్పుడు ఆ డబ్బును మార్చేసుకునే అవకాశం కూడా తక్కువగా ఉండడంతో ఐటీ దాడులు జరిగితే దొరికిపోయే ప్రమాదం ఎక్కువ అని పలువురు భావిస్తున్నారు.
నిన్నటికి నిన్న ఫారెక్స్ వ్యాపారులు, హవాలా వ్యాపారులు ఇలాంటి వారిపై ఐటీ దాడులు జరిగాయి. రెండు రోజులుగా బంగారం దుకాణాల్లో అధికంగా కార్యకలాపాలు చేసిన వారి వివరాలు సేకరిస్తున్న ఐటీ అధికారులు ఆ వివరాలను వడపోత పోసి , ఆ మేరకు దాడులు నిర్వహిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.