రెండు వారాలు ఆగలేకపోతున్న టీపీసీసీ నేతలు

Update: 2016-12-06 03:57 GMT

కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదంటూ అవకాశం దొరికినప్పుడెల్లా విరుచుకుపడడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాస్త ముందంజలో ఉన్నారు. డిసెంబరు నెల వచ్చిన దగ్గరినుంచి ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ వారు డిమాండ్లు కూడా ప్రారంభించారు. వారికి నేరుగా సమాధానం ఇవ్వడం కాకపోయినా.. ఈనెల మూడో వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను చర్చించేయడానికి రెండు వారాలు కూడా ఆగలేకపోతున్నారేమో గానీ.. కాంగ్రెస్ నాయకులు తక్షణమే అసెంబ్లీని సమావేశ పరచాలంటూ.. అసెంబ్లీ ఆవరణలోని గాంధీవిగ్రహం వద్ద ధర్నాలకు దిగడం, ఆందోళన చేయడం, పోలీసులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితిని తీసుకువెళ్లడం.. ఇదంతా చిత్రంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు అనేవి ప్రహసనప్రాయంగా మారిపోయాయి. సమావేశాలు మొదలయ్యే సమయానికి విపక్షాలు ఏదో ఒక అంశంతో తయారుగా ఉండడం.. మొదలైనప్పటినుంచి అదొక్కటే అంశాన్ని పట్టుకుని సభాకార్యక్రమాలను స్తంభింపజేయడం, సస్పెన్షన్ లకు గురికావడం.. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మారిపోయాయి. బిల్లులన్నీ మూజువాణీ ఓట్లతోనే గట్టెక్కడమూ రివాజుగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అధికారిక భవంతి నిర్మాణం, రెండు పడగ్గదుల ఇళ్లను పట్టించుకోకపోవడం, ఫీజు రీఇంబర్స్ మెంట్ వంటి విషయాలను అధికంగా ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ సమావేశాలు కావాలంటూ డిమాండ్ చేసింది. రెండురోజుల వ్యవధిలోనే ప్రభుత్వం మూడోవారంలో అసెంబ్లీ పెట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీ ఒకరకంగా అసహనానికి గురైనట్లు చెప్పుకోవాలి. ఎందుకంటే.. తమ డిమాండుకు ప్రభుత్వం స్పందిచకపోతే.. అసెంబ్లీని సమావేశపరచడానికి కేసీఆర్ భయపడుతున్నారని, ఇత్యాది విమర్శలతో కొన్నాళ్లు నెట్టడానికి అవకాశం ఉంటుంది. తమ డిమాండుకు వెంటనే.. షెడ్యూలు రావడంతో వారు ఇబ్బంది పడ్డట్లుగా ఉంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీలో సమావేశమై... శీతాకాల సమావేశాల షెడ్యూలును వెంటనే ప్రకటించాలని, పత్రికల్లో చూసి ఆ ప్రకారం తెలుసుకోవాలనుకోవడం దారుణం అని కామెంట్లు రువ్వుతూ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకోసం బైఠాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదిలో 52 రోజులు అసెంబ్లీ నడిస్తే తెలంగాణలో ఏడాదికి 18 రోజులే నడుపుతున్నారని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఇందుకేనా అనే వారి ప్రశ్న సహేతుకమైనదే గానీ.. ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహిణకు సిద్ధపడి.. ఇంకాస్త నిందలేసే అవకాశం తమకు లేకుండా చేశారని వారు బాధపడుతున్నట్లుంది. అందుకే తాజాగా మూడో వారం వరకు తాము ఆగలేం అన్నట్లుగా తక్షణం సభ పెట్టాలంటూ కొత్త పాట అందుకుంటున్నారు.

Similar News