కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కొంత భవిష్యత్ లో మేలు చేకూర్చేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 3,320 కోట్లను కేటాయించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 1,561 కోట్లను కేటయించారు. దీంతో పాటు సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉండనున్నాయి.దేశంలో కీలక ఖనిజాల రంగంలో భారత్ పాత్రను కొత్త దిశలో మలిచే కీలక చర్యను ఆర్థిక మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు. రేర్ ఎర్త్ ఖనిజాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటులో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు.ఈ రేర్ ఎర్త్ కారిడార్లు గనుల తవ్వకం నుంచి శుద్ధి, పరిశోధన, ఆధునిక తయారీ వరకు మొత్తం విలువ గొలుసును కలిగి ఉంటాయని మంత్రి వివరించారు. రేర్ ఎర్త్ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.
రేర్ ఎర్త్ పర్మెనెంట్...
నవంబర్ 2025లో ప్రవేశపెట్టిన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల పథకానికి ఇది కొనసాగింపుగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఆ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. దేశంలో సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ల తయారీని ప్రోత్సహించేందుకు రూ.7,280 కోట్ల పెట్టుబడి కేటాయించారు. ఈ వినూత్న పథకం ద్వారా ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సమగ్ర రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో స్వయం ఆధారితత పెరగడమే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుందని కేబినెట్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రేర్ ఎర్త్ సరఫరాలో భారత్ పెద్దఎత్తున చైనాపై ఆధారపడుతోంది.
ఈ కారిడార్లతో...
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, ఆధునిక తయారీకి రేర్ ఎర్త్ ఖనిజాలు కీలకమైన నేపథ్యంలో ఈ ఆధారపడటం వ్యూహాత్మక ఆందోళనలకు దారి తీస్తోంది. దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా కీలక సరఫరా గొలుసులను భద్రపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఎంపిక చేసిన రాష్ట్రాల తీరం వెంట మోనజైట్ సహా బీచ్ సాండ్ ఖనిజాలు విస్తారంగా లభ్యమవుతుండటంతో వాటిని సమగ్ర అభివృద్ధికి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు.ఈ కారిడార్లు కేవలం తవ్వకాలకు పరిమితం కాకుండా అధిక విలువ గల శుద్ధి, రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీ వరకు విస్తరిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల దేశంలోని వనరుల నుంచి ఆర్థిక, సాంకేతిక లాభాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.చైనా రేర్ ఎర్త్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దాదాపు ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యను వ్యూహాత్మక స్పందనగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. జాతీయ కీలక ఖనిజాల మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పథకం అమలవుతుందని, గనుల రంగంలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే తాజా సంస్కరణలకు ఇది తోడ్పడుతుందని కేంద్రం తెలిపింది.