Union Budget : మోదీ సర్కార్ సవాల్ కు రేవంత్ నిధులు సమీకరణ సాధ్యమేనా?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా సవాల్ విసిరినట్లయింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా సవాల్ విసిరినట్లయింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర సహాయం దక్కించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరినట్లు కనిపిస్తోంది. ఈ నిధులు అందితే, ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం ఈ ప్రణాళికలో ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉండనుంది. అయితే ఈ నిధుల సమీకరణ తెలంగాణ ప్రభుత్వానికి ఛాలెంజ్ అని చెప్పాలి.
హై స్పీడ్ రైలు కారిడార్లు...
హైదరాబాద్ నుంచి విజయవాడ, ముంబయి, బెంగళూరు దిశగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్లు, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు పన్ను రాయితీలు వంటి చర్యలు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుకు ఊపునిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే కీలక కేంద్రంగా ఎదుగుతోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ, వచ్చే ఐదేళ్ల పాటు ఏటా రూ.లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం ఈ నిధిపై చర్చలు జరిగినా, రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. బడ్జెట్ తర్వాతే కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
పట్టణ మౌలిక సదుపాయాల్లో...
గత రెండేళ్లుగా పట్టణ మౌలిక సదుపాయాల్లో హైబ్రిడ్ అన్యుటీ మోడల్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ప్రాజెక్టులు ప్రతిపాదించడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మురుగునీటి వ్యవస్థను రూ.17 వేల కోట్లతో పూర్తిగా ఆధునీకరించడం, గోదావరి జలాలను జంట నగరాలకు తరలించడం, మంజీరా, ఉస్మాన్ సాగర్ నీటి వనరుల పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులు UCF కింద ప్రతిపాదనలో ఉన్నాయి.
మూసీ నది ప్రక్షాళనకు...
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జంట నగరాలకు గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్ల రుణాన్ని హడ్కో నుంచి ఇప్పటికే ఆమోదించించడంతో పాటు, HAM కింద అమలు చేయడానికి ప్రైవేట్ భాగస్వామిని కూడా ఎంపిక చేసింది ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కూడా అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌కు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. తొలి దశ పనులకు రూ.4,500 కోట్లలో 50 శాతం నిధులు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.