జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణుల నిప్పు.. వ్యాఖ్యలకు నిరసనగా
జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణుల నిప్పు.. వ్యాఖ్యలకు నిరసనగా
ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ లకు వ్యతిరేకంగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు దూసుకెళ్లిన టీడీపీ శ్రేణులు ఇంటికి నిప్పంటించారు. జోగి రమేష్ ఆ సమయంలో ఇంట్లో లేరు. ఆయన తండ్రితో పాటు భార్య మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. చంద్రబాబు లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ దాడి చేశారు. జోగి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వారు పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలని...
జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తమ నాయకులను కించ పర్చే విధంగా ఉన్నాయని, వెంటనే క్షమాపణలు చెప్పకుంటే తాము ఇంటి నుంచి బయటకు రానివ్వబోమని హెచ్చరించారు. మరొకవైపు జోగి రమేష్ ఇంటి వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు మోహరించారు. ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో లేని జోగి రమేష్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా సరే టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశాలతో జోగి రమేష్ ఇంటికి నిప్పంటించడంతో వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే జోగి రమేష్ వెంటనే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దాడులకు భయపడబోం...
అయితే దీనిపై జోగి రమేష్ స్పందించారు. లోకేశ్.. పిల్ల చేష్టలుమానుకో.. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. లోకేశ్ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి లోకేశ్ ఇల్లు అంతే దూరమని గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే జోగి రమేష్ ప్రస్తుతం తరిపతిలో ఉన్నారని తెలుస్తోంది. తాను ఏం మాట్లాడానని తన ఇంటిపై లోకేశ్ దాడికి పంపావని ప్రశ్నించారు. దాడులకు భయపడే ప్రసక్తి లేదని జోగి రమేష్ అన్నారు. మాపై దాడులు చేస్తూ లోకేశ్ రాక్షాసానందం పొందుతున్నారని జోగి రమేష్ అన్నారు. దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తుండటమేంటని జోగి రమేష్ ప్రశ్నించారు.