హైదరాబాద్ వ్యక్తి రూ.58.22 లక్షల మోసం నకిలీ ‘బ్లాక్ ట్రేడింగ్’ పెట్టుబడి పేరుతో సైబర్ మోసం
5పైసా ప్రతినిధులమని నటించిన మోసగాళ్లు అనేక బ్యాంక్ ఖాతాలు, యూపీఐలకు నగదు బదిలీ దేశవ్యాప్త ఖాతాల నెట్‌వర్క్‌పై సైబర్ క్రైమ్ దర్యాప్తు
హైదరాబాద్: నకిలీ ‘బ్లాక్ ట్రేడింగ్’, ఐపీవో పెట్టుబడుల పేరుతో మోసగాళ్లు రూ.58.22 లక్షలు కాజేసిన ఘటనలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల గందం అనిల్ కుమార్ సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రతినిధులమని చెప్పుకుని మోసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం… 2025 డిసెంబర్ 31 నుంచి ‘ఈషానా యాదవ్’ అని పరిచయం చేసుకున్న ఓ మహిళతో పాటు మరికొందరు ‘5పైసా ఫైనాన్షియల్ థాట్స్’ సంస్థకు చెందినవాళ్లమని చెప్పుతూ ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు పంపారు. బ్లాక్ ట్రేడింగ్ ద్వారా ఖచ్చితమైన అధిక లాభాలు వస్తాయని చెప్పి ‘L121 5పైసా ఫైనాన్షియల్ థాట్స్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోకి చేర్చారు. ఆ గ్రూప్‌లో వంద మందికి పైగా సభ్యులు ఉన్నట్టు అనిల్ కుమార్ తెలిపారు.
గ్రూప్‌లో తామే నిపుణులమని చెప్పుకున్న సభ్యులు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనురాగ్ ఠాకూర్, సీఈవో గౌరవ్ సెత్‌గా చెప్పుకున్న వ్యక్తులు నకిలీ ట్రేడింగ్ డ్యాష్‌బోర్డులు, లాభాల స్క్రీన్‌షాట్లు చూపించారని చెప్పారు. వాటిని నమ్మిన అనిల్ కుమార్ తన పొదుపులు, కుటుంబ సభ్యుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బుతో కలిపి మొత్తం రూ.58,22,175 పెట్టుబడి పెట్టారు.
మోసగాళ్లు ఇచ్చిన వివరాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని పలు బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలకు ఈ మొత్తాన్ని విడతలుగా బదిలీ చేసినట్టు ఆయన తెలిపారు. మొదట్లో రూ.500, రూ.22,275, రూ.40 వేల చొప్పున చిన్న మొత్తాలు ఎస్‌బీఐ ఖాతాలోకి వచ్చాయని, ఆ తర్వాత పెద్ద మొత్తాల విత్‌డ్రాయల్‌లను అడ్డుకున్నారని చెప్పారు.
యాప్‌లో తన ఖాతాలో రూ.1.90 కోట్ల బ్యాలెన్స్ చూపించారని, అందులో నుంచి రూ.81 లక్షలు తీసుకోవాలని ప్రయత్నించగా తిరస్కరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాభాలపై 20 శాతం కమిషన్ లేదా బ్రోకరేజ్ పేరుతో ముందుగా రూ.38.18 లక్షలు చెల్లించాలని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెంట్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. యాప్‌లో చూపిన బ్యాలెన్స్ నుంచే ఆ మొత్తాన్ని కట్ చేయాలని కోరినా, కొత్తగా చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేసినట్టు ఆరోపించారు.
సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్‌లా నటించారని, నిజమైన పెట్టుబడి వేదికలు లాభాల తర్వాత వేరుగా కమిషన్ అడగవని అనిల్ కుమార్ తెలిపారు. ‘5paisa-pro.com’ యాప్ పేరు, లావాదేవీల వివరాలు, మొబైల్ నంబర్లు, ఖాతా సమాచారం అన్నీ పోలీసులకు అందించారు.
సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దేశవ్యాప్తంగా ఉపయోగించిన ఖాతాల నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఎన్సీఆర్‌పీ అంగీకార సంఖ్య జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.