Ambati Rambabu : రాజమండ్రి జైలుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు

Update: 2026-02-02 02:44 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. చంద్రబాబును దూషించిన కేసులో రాంబాబుకు న్యాయమూర్తి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే న్యాయమూర్తి ఎదుట అంబటి రాంబాబు తన ఆవేదన చెప్పుకున్నారు. తనను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటలకు పోలీసులు సెల్లులో నుంచి బయటికి తీసుకువచ్చారని, నల్లపాడు సిఐ వంశీ తో పాటు మరో ఇద్దరు సిఐలు నన్ను వేధించారని తెలిపారు. తన రెండు కాళ్లు వెడల్పుగా చేసి ఇబ్బంది పెట్టారని, తనకు కాళ్లకు నొప్పులు వచ్చాయని, తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సిఐ నాకు చెప్పారన్నారు.

తనను వేధించారని...
కానీ పైనుంచి మాకు ఒత్తిడి ఉంది అందుకే ఇలా చేయవలసి వస్తుందని సిఐ వంశీ చెప్పారన్నారు. స్టేషన్లో తనను ఎవరిని కలవనివ్వలేదని, తన పైన దాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేయడంతో అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రిమాండ్ రిపోర్టులో ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు.. సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరుఉందని పేర్కొన్నారు.
అల్లర్లు చెలరేగే అవకాశముందంటూ...
సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలు చేశారని రిపోర్టులో నల్లపాడు పోలీసులు ప్రస్తావించారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందని కోరడంతో అంబటిని న్యాయమూర్తి పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ తీర్పుపై అంబటి రాంబాబు హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.



Tags:    

Similar News