మోదీ వ్యతిరేక కూటమి చీలుతోందా?

Update: 2016-11-23 23:50 GMT

నల్లడబ్బు నియంత్రణకు మోదీ సర్కారు చేస్తున్న ప్రయత్నాల పట్ల చాలా విపక్ష పార్టీల్లో వ్యతిరేకత వెల్లువెత్తడాన్ని జనభారతం గమనిస్తూనే ఉంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కలసి మోదీ సర్కారును చికాకు పెట్టడానికి తాము చేయగలిగినదెల్లా చేస్తున్నాయి. మమతా బెనర్జీ నోట్ల రద్దు వ్యవహారాన్ని వీలైనంత రాద్ధాంతం చేయడమే లక్ష్యం అన్నట్టుగా.. అలాంటి అభిప్రాయంతో ఉన్న దేశంలోని అన్ని పార్టీలను పోగేసి.. సమష్టిగా ఉద్యమింపజేయడానికి నడుం బిగించిన వైనం కూడా అందరూ గమనిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో నోట్ల రద్దు అంశంపై మోదీ వ్యతిరేకతతో అంటకాగిన పార్టీల్లో బేదాభిప్రాయాలు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

పైకి ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమే అయినప్పటికీ.. అంశాల వారీగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెడుతూ ఉండే.. శివసేన ఇన్నాళ్లూ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. మమతా బెనర్జీ తో జట్టు కట్టి మోదీ నిర్ణయంపై విమర్శలు కురిపించింది. ఈ విషయంలో ఇప్పటికి బాల్ థాకరే గనుక జీవించి ఉంటే ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసి ఉండేవాళ్లంటూ.. భాజపా సచివులు వ్యాఖ్యలు చేసిన సంగతి ప్రజలకు గుర్తుంటుంది.

అయితే తాజాగా శివసేన మోదీ నిర్ణయానికి జై కొడుతోంది. నోట్ల రద్దు విషయంలో జనం కష్టాలను తొలగించాలని మాత్రమే తాము కోరుతున్నామని... మమతా బెనర్జీ ఏకంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంటున్నదని శివసేన ఎంపీలు వెల్లడించడం విశేషం. ఇదే ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ తో కలిసి ఆందోళనల్లో కూడా పాలుపంచుకున్న వారే. అంటే స్పష్టంగా నోట్ల రద్దు విషయంలో మోదీ నిర్ణయం పట్ల ప్రతిపక్షాల అభిప్రాయాల్లో కూడా మార్పు వస్తున్నట్లుగా భావించాలి. ప్రజల కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నిరంతరాయ ఆందోళనలకు విలువ ఉండడం లేదని పలువురు భావిస్తున్నారు.

కొత్త నోట్లు అందుబాటులోకి వస్తూ జనం కష్టాలు తగ్గుతున్న కొద్దీ.. ప్రతిపక్షాలు ఎంత యాగీచేసినా ప్రజలు కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికే రకరకాల ఉపశమన చర్యలు కేంద్రం తీసుకుంటున్న నేపథ్యంలో 28న విపక్షాలు దేశవ్యాప్తంగా తలపెడుతున్న బంద్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో కూడా అనుమానంగానే ఉంది.

Similar News