మోదీ మాటల్లో యుద్ధ భేరీలు!

Update: 2016-10-02 10:28 GMT

సాంకేతికంగా ఇంకా మోర్టార్లు వర్షించడం లేదు, ఫిరంగుల నినాదాలు ప్రారంభం కాలేదు. అంతే తప్ప.. భారత పాకిస్తాన్‌ దేశాల మధ్య ఇంచుమించుగా యుద్ధ వాతావరణమే నెలకొని ఉన్నది. సర్జికల్‌ దాడులు జరిగిన నాలుగు రోజుల తర్వాత తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ ఇప్పటికీ తన మాటల్లో యుద్ధమే దోబూచులాడేలా సంకేతాలు ఇస్తున్నారు.

భారత్‌.. యుద్ధానికి సిద్ధమవుతున్నది. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న యావత్‌ సైనిక కార్యకలాపాలకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు ఈ అంశాలను ధ్రువీకరిస్తున్నాయి. ఇదంతా స్పష్టంగానే తెలుస్తున్న నేపథ్యంలో.. మోదీ ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. యుద్ధ సంకేతాలనే మళ్లీ తన మాటల్లో వినిపించారు.

భారత్‌ తనంతగా ఏ దేశం మీద ముందుగా దాడికి దిగలేదని మోదీ అన్యాపదేశంగా పాకిస్తాన్‌ను హెచ్చరించడం విశేషం. భారత్‌ పరాయి భూభాగాన్ని ఆక్రమించలేదు, ఏ దేశంపైనా దాడికి దిగలేదు .. ప్రాణత్యాగాలే తప్ప ముందు దాడులు మనకు తెలియవు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇంచుమించుగా ఏ క్షణంలోనైనా యుద్ధభేరీలు మోగుతాయనే వాతావరణమే సరిహద్దుల్లో కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు.

Similar News