ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మునిసిపాలిటీలు, నగర కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లేనా? ఆశావహులు ఇక రంగం సిద్ధం చేసుకోవాలా? తాజాగా వాతావరణం చూస్తే మాత్రం అవుననే అనిపిస్తోంది. త్వరలో రాబోతున్న మునిసిపల్ ఎన్నికలకు తయారుగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు సూచన ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మునిసిపోల్స్ కు గంట మోగినట్లేనని అంతా అనుకుంటున్నారు.
అయితే చంద్రబాబునాయుడు సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజల తీర్పును ఎదుర్కొనే పరిస్థితి రాలేదు. అంతో ఇంతో వచ్చిన చిన్న చిన్న ఎన్నికల్లో ఓ మోస్తరుగా గట్టున పడ్డారు. అదే సమయంలో, అటు తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఎలాంటి ఎన్నికలు వచ్చినా అప్రతిహతంగా విజయాలతో దూసుకుపోతోంది. ఈ పోలిక వస్తుందనే కావొచ్చు.. చంద్రబాబునాయుడు చాలాకాలంగా నగర కార్పొరేషన్ల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నా పట్టించుకోలేదు. తాజాగా ఆయన సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా నెగ్గుకొస్తుంది అనేది కీలకం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ రాజ్యం ఖరారు అని ఇప్పటినుంచే చెప్పుకుంటున్న వైకాపా అధినేత జగన్, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా తన ముద్రను చూపించగలరా? శవాసనం వేసిన కాంగ్రెస్ పార్టీ తిరిగి జవజీవాలు పుంజుకునే చిన్న అవకాశం అయినా ఆ రాష్ట్రంలో ఉందా? హోదా విషయంలో చేసిన మోసానికి భాజపాకు ఎలాంటి ప్రజల తీర్పు దక్కబోతోంది..? ఇలాంటి వన్నీ ఈ ఎన్నికల్లో తేలుతాయి.