బహమాస్ లీక్స్ : 475 మంది నల్ల కుబేరులు

Update: 2016-09-22 15:44 GMT

ఒక పారిశ్రామికవేత్తకు ఒక కంపెనీ ఉంటుంది. నాలుగైదు కంపెనీలు ఉంటే చాలా గొప్ప , పెద్దస్థాయి పారిశ్రామికవేత్త అనుకుంటాం. అదే 475 మంది పారిశ్రామికవేత్తలకు వేలాది కంపెనీలు ఉంటే ఏం అనుకోవాలి? అంటే సగటున ఒక వ్యక్తికి పదులు వందల కంపెనీలు! చాలా చాలా చా...లా.. గొప్ప పారిశ్రామికవేత్త అనుకుంటే.. పప్పులే కాలేసినట్టే. అలాంటి వారు దొంగడబ్బు, నల్లధనం దాచుకునే అక్రమార్కులు అనుకోవాలి. అవును మరి.. తాజాగా గురువారం నాడు భారతీయ నల్లకుబేరుల గురించి బహమాస్ లీక్స్ పేరుతో వెల్లడైన సంచలన వాస్తవాలు ఈ వివరాలనే బయట పెడుతున్నాయి.

గతంలో ప్రపంచ వ్యాప్తంగా నల్లకుబేరుల వివరాలను బయటపెట్టడం ద్వారా వికీలీక్స్ సంచలనాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. పనామా లీక్స్ పేరుతో ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ వారు నల్లధనం వివరాలు బయట పెట్టారు. ఇవాళ బహమాస్ లీక్స్ పేరుతో కొత్తగా నల్లకుబేరుల వివరాలు బయటకు వచ్చాయి. అందులో భారతదేశానికి చెందిన 475 మంది పేర్లు బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 1.75 లక్షల మంది నల్లకుబేరులు ఉన్నట్లు వెల్లడించారు. వీరంతా బహమాస్ లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు.

కాగా, ట్విస్టు ఏంటంటే.. ఈ బహమాస్ లీక్స్ నల్లకుబేరుల జాబితాలో తెలుగు ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖంగా మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. సికింద్రాబాద్ లోని ఒకే అడ్రసుతో 20కి పైగా కంపెనీలు రిజిస్టరు అయి ఉన్నట్లు కూడా వివరాలు వెల్లడయ్యాయని అంటున్నారు. పూర్తివివరాలు తెలిసే సరికి నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటూ ఇంకా ఎంతమంది తెలుగు పేర్లు వెలుగు చూస్తాయో మరి.

Similar News