ప్రధానికి జగన్ లేఖాస్త్రం : నోట్ల రద్దు వాయిదా వేయాలి

Update: 2016-11-23 18:15 GMT

నోట్ల రద్దు లేదా నోట్ల మార్పిడి అనే వ్యవహారం మొదలై సరిగ్గా రెండు వారాల తర్వాత.. ఏపీలోని ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి స్పందించారు. రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ నోటు కష్టాలను ప్రస్తావించిన జగన్, ఆ ప్రెస్ మీట్లో ప్రధానంగా తన దృష్టి మొత్తం.. నోటు కష్టాల నివారణలో చంద్రబాబునాయుడు వైఫల్యం మీదనే ఫోకస్ చేశారు. అయితే అక్కడితో తాను ఆగేది లేదన్నట్లుగా.. ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేయాలనే అదే డిమాండ్ తో జగన్, ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

నల్లడబ్బు రద్దు గురించి చేయాలనుకున్న ప్రయత్నం మంచిదే గానీ.. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అయినప్పటికీ.. ఈ నిర్ణయం ప్రకటించడానికి ముందు తగినంత కసరత్తు చేయకపోవడం వలన ప్రజలకు అనూహ్యమైన అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ జగన్మోహన రెడ్డి మోదీకి రాసిన లేఖలో అభిప్రాయం వెల్లడించారు.

ప్రధానంగా రైతులకు ఎదురవుతున్న కష్టాలనే జగన్ ఎక్కువగా ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు వలన రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రైతుల్లో 42 శాతం మందికే బ్యాంకు రుణాలు దక్కుతుండగా, మిగిలిన వారికి వడ్డీ వ్యాపారులే ఆధారం అని జగన్ పేర్కొన్నారు. అసలే 95 శాతం మంది కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పైగా ఈ సమయంలో ఎరువుల వ్యాపారలు, విత్తనాల వ్యాపారులు కూడా పాత నోట్లు తీసుకోవడం లేదని.. రైతులకు అవస్థలు తప్పడం లేదని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

 

జగన్ అసలు ఎందుకు లేఖ రాసినట్లు?

తాను లేఖ రాసినంత మాత్రాన కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నల్లడబ్బు నియంత్రణలో ప్రదర్శిస్తున్న దూకుడు, ప్రస్తుత వ్యవహారాల విషయంలో తమ బాట మార్చుకుంటుందనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. విపక్షాలు చేసే విమర్శలను, ఆందోళనలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని, ప్రజలు తమ ప్రయత్నాన్ని దీవించారని మోదీ ఇప్పటికే తేల్చేసిన తర్వాత... జగన్ ఈ సమయంలో ప్రధానికి ఎందుకు లేఖ రాశారో అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. తన లేఖ వలన ఉపయోగం వీసమెత్తు అయినా ఉండదని తెలిసినప్పటికీ.. ఆ ప్రయత్నం ఆయన ఎందుకు చేశారో అని జనం అనుకుంటున్నారు. ఏదో జనం ముందు తాను ప్రధానికి కూడా లేఖ రాశా అని చెప్పుకోడానికి ఉపయోగపడుతుందే తప్ప.. వాస్తవంలో కష్టాలు తీర్చడానికి ఏమాత్రం ఉపయోగపడదని జనం భావిస్తుండడం గమనార్హం.

Similar News