‘‘అవును మరి.. ఇద్దరూ ఒకటే లక్ష్యాన్ని వెల్లడిస్తున్నారు. ఇద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు మడమ తిప్పేది లేదంటున్నారు. మరి ఇద్దరూ కలిసి పోరాడితే తప్పేముంది. ’’
- ఇలాంటి సందేహం ప్రజల్లో చాలా మందికి కలిగి ఉండవచ్చు గాక. కానీ ఇదే మాట అఫీషియల్ గా ఓ పార్టీ రాష్ట్రనేత నోటినుంచి కూడా ప్రతిపాదనగా రావడం విశేషం.
పవన్ కల్యాణ్ , జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలో సభలు పెడుతూ ఉద్యమిస్తున్న తరుణంలో.. ఇదే డిమాండుతో తాము కూడా తమ శక్తివంచన లేకుండా పోరాడుతున్న వామపక్షాలనుంచి ఈ ప్రతిపాదన రావడం విశేషం.
సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ.. పవన్, జగన్, వామపక్షాలు కలసి ఉమ్మడిగా పోరాటం సల్పితే.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పకుండా వస్తుందని సెలవిచ్చారు.
మరి పవన్ కల్యాణ్ తనకు వామపక్షాలంటే ఎంతో గౌరవం ఉన్నదని అంటూ ఉంటారు. అలాంటప్పుడు వామపక్షాలనుంచి వచ్చిన ఈ సాధికారమైన ప్రతిపాదన పట్ల ఆయన ఎలా స్పందిస్తారు? ఇది మాత్రం ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్నే.