పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన భాజపా ఎంపీ!

Update: 2016-11-19 15:59 GMT

పవన్ కల్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేసి.. ఎన్డీయే కూటమి గెలవడానికి తన వంతు పాత్ర పోషించారు అనేది అందరికీ తెలుసు. అందుకే ఆయన పట్ల భాజపా నాయకులు కూడా చాలా కృతజ్ఞతతో మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ ఎప్పుడైనా కాస్త ఆవేశంగా భాజపా నాయకుల్ని తిట్టిపోసినా కూడా.. వారు మాత్రం కాస్త మెతకగా. పవన్ కల్యాణ్ గానీ, ఆయన అభిమానులు గానీ నొచ్చుకోకుండా స్పందిస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీచేసే విషయం ఖరారు చేసిన తర్వాత.. భాజపా నాయకుల్ని ఎడాపెడా తన ప్రసంగాల్లో ఆటాడుకుంటున్న నేపథ్యంలో వారి స్పందన కూడా మారుతోంది. కొందరు ఒక రకంగా కొందరు మరో రకంగా స్పందిస్తున్నారు.

తాజాగా గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో తాను అక్కడకు వెళ్లి అయినా ఉద్యమం చేయడానికి సిద్ధం అంటూ పవన్ కల్యాణ్ స్పందించినందుకు .. ఇన్నాళ్లకు అక్కడి ఎంపీ గోకరాజు గంగరాజు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఆనాడు తన విమర్శల్లో ప్రధానంగా స్థానిక ఎంపీగా గోకరాజు గంగరాజు మీదనే విరుచుకుపడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆందోళనలు చేస్తున్నంత మాత్రాన గోదావరి ఫుడ్ పార్క్ లోపలకు వెళ్లి దాడులు చేస్తే కేసులు పెట్టకుండా ఉండాలా? పవన్ కల్యాణ్ కు ఆ మాత్రం తెలియదా అని గోకరాజు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు పవన్ కు ఒక లేఖ కూడా రాస్తానని ఆయన చెబుతున్నారు. గోకరాజు రంగరాజు లేఖ రాసినా, దానిని కూడా మీడియాకు విడుదల చేసినా.. పవన్ కల్యాణ్ ఈసారి బహిరంగ సభ పెట్టే వరకు దాని గురించి స్పందించరు అనేది గ్యారంటీ. ఫుడ్ పార్క్ నుంచి వ్యర్థాలు యనమదుర్రు డ్రెయిన్ లోకి వెళ్తాయే తప్ప గోదావరిలో కలిసేది జరగదని ఆయన అంటున్నారు.

మరి ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న స్థానికులకు - పవన్ కల్యాణ్ తాను వారికి అండగా ఉంటానని గట్టి హామీ ఇచ్చిన నేపథ్యంలో భాజపా ఎంపీ ఇస్తున్న షాక్ ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో చూడాలి.

Similar News