పేదలకు పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చే విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒక్కొక్కరూ ఒక్కొక్కరకంగా తమదైన సృజనాత్మక శైలిని అనుసరిస్తున్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లంటూ హడావుడి చేస్తోంటే.. మరోవైపు చంద్రబాబునాయుడు.. ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటూ కొన్ని సంవత్సరాలు వాటి మెయింటెనెన్స్ కూడా తమ బాధ్యతే అంటూ కొత్త ప్రణాళిక చేస్తున్నారు. నగరాల్లో పెద్దస్థాయి అపార్ట్ మెంట్ల లాగా కట్టి ఇచ్చిన తర్వాత.. కొన్నాళ్లు మెయింటెనెన్స్ ప్రభుత్వమే చేయించాలని, అందుకు అవసరమైన సొమ్మును కూడా నిర్మాణ వ్యయంలో భాగంగానే చూడాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.
డిసెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో లక్షా ఇరవై వేల గృహాల నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కాకినాడ, నెల్లూరు, తాడిపత్రి, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో తక్షణం పనులు చేపట్టాలని నిర్దేశించారు.
పట్టణ గృహ నిర్మాణం పథకం కింద నిర్మించే ఇళ్లకు నాలుగు నమూనాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. నిర్మాణాలు ఎంత పటిష్టంగా వున్నా, సరైన నిర్వహణ లేకపోతే శిథిలావస్థకు చేరుకుంటాయని, అందుకే నిర్మాణంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణకు కూడా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందుకోసం గృహ సముదాయాల నిర్మాణ సమయంలోనే మూల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది గృహ నిర్మాణ వ్యయంలో భాగంగా వుండాలే తప్ప లబ్దిదారుని నుంచి అదనంగా వసూలు చేయకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మరోవైపు పట్టణాలు, నగరాలలోని రహదారులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. పురపాలక శాఖ, రోడ్లు భవనాల శాఖ సమన్వయంతో రాష్ట్రంలోని మొత్తం 110 మున్సిపాలిటీల్లో రహదారుల మరమ్మతులు, అవసరమైన చోట్ల నూతన రహదారుల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు, సుందరీకరణ పనుల పురోగతి వివరాలను ప్రతి నెలా తనకు నివేదించాలని చెప్పారు.