అనుకున్నట్లే అయింది. కర్రల యుద్ధం ఒక ప్రాణాన్ని బలిగొంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరంతో ఒకరు మృతి చెందగా మరో 80 మంది వరకూ గాయపడ్డారు. కర్నూలు జిల్లాలో దేవరగట్టు ఉత్సవం సంప్రదాయంగా వస్తోంది. బన్నీ ఉత్సవం అని అంటారు. రెండు గ్రామాల ప్రజలు కర్రలకు ఇనుపచువ్వలు కట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రక్తం చిందింది. తలలు పగిలాయి. పోలీసులు కొన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని అహింసాయుతంగా జరుపుకోవాలని పిలుపునిస్తూనే ఉన్నారు. ఉత్సవానికి ముందు గ్రామ పెద్దలతో సమావేశాలను ఏర్పాటు చేసి మరీ చెబుతున్నారు. అయినే గ్రామ ప్రజలు ససేమిరా అంటున్నారు. విపరీతమైన భక్తి వారిని సంప్రదాయం వైపు మొగ్గుచూపుతోంది. నిన్న దేవరగట్టు బన్నీ ఉత్సవానికి దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. పోలీసులు ఎంత ఆపాలని ప్రయత్నించినా గ్రామస్థులు ఆగలేదు. విపరీతంగా జనం రావడంతో ఉత్సవంలో అపశృతి దొర్లింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.