Amaravathi : భూములు కొనేవారు లేరట.. నెవర్ ఎండింగ్ ల్యాండ్ పూలింగ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణకు నోటిఫికేషన్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణకు నోటిఫికేషన్ విడుదలయింది. మూడో విడత భూ సమీకరణ కూడా ఉంటుందని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు. దీంతో రాజధాని రైతుల్లో ఆందోళన పెరిగింది. ఎన్ని విడతలుగా భూ సమీకరణ ఉంటుందో? ఏ ఏ గ్రామాల నుంచి భూమిని సేకరిస్తుందన్న అలజడి మొదలయింది. ఇప్పటికే మొదటి విడతగా 34 వేల ఎకరాలను 29 వేల మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకూ రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు. సీఆర్డీఏ అధికారులు కూడా సరైన సమాధానాలు చెప్పకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సముదాయించాల్సిన పరిస్థితి తలెత్తింది.
మూడో విడత కూడా ఉంటుందని...
మరొకవైపు మంత్రి నారాయణ వరసగా రాజధాని ప్రాంత రైతులపై బాంబులు పేలుస్తున్నారు. రెండో విడత కాదు.. మూడో విడత భూ సమీకరణ కూడా ఉంటుందని నారాయణ చెప్పారు. మూడో విడత భూ సేకరణ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాలకు తీసుకుంటారన్న ప్రచారం ఈ ప్రాంత గ్రామాల్లో జోరుగా సాగుతుంది. దీంతో నిన్న మొన్నటి వరకూ ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి వచ్చే వారు సయితం ఇప్పుడు కొంత వెనకడుగు వేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ కింద భూమిని కోల్పోతే తమకు నష్టం వస్తుందని భావించి ఎవరూ భూముల కొనుగోలుకు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూ సమీకరణకు సహకరించకుంటే...
మరొకవైపు రెండో విడత భూ సమీకరణకు సహకరించాలని, లేకుంటే మరొక మార్గంలో భూమిని తీసుకుంటామని నారాయణ చెప్పకనే చెప్పారు. భూసమీకరణకు తిరస్కరిస్తే భూసేకరణ అంటూ.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిపడేశారర. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం భవనాలతో కూడిన నగరంగానే కాకుండా, పచ్చదనం, ప్రకృతి సౌందర్యంతో తొణికిసలాడే నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంటే భూసమీకరణకు ఒప్పుకోకుంటే భూ సేకరణ జరుపుతామని చెప్పడంతో రైతులకు మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందుకే రెండు కాదు.. ఎన్ని విడతలయినా భూమిని రాజధాని అమరావతి కోసం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది.