Deepak Reddy : అతి చేస్తే అంతే.. ఏదో అవుతుందనుకుంటే..మరేదో అయిందిగా?

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పై పార్టీ నాయకత్వం అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది

Update: 2025-12-09 07:02 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డికి నోటి దూల ఎక్కువ. అందులోనూ ఆయన పార్టీలో మరింత పట్టు సంపాదించాలనుకున్నారేమో. చినబాబును లోకేశ్ ను ప్రసన్నం చేసుకోవాలన్న తపనతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే చివరకు దీపక్ రెడ్డికి పార్టీ నాయకత్వం తలంటాల్సి వచ్చింది. దీపక్ రెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. 2021లో అనంతపురం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా టీడీపీ తరుపున ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి ఇంకా తన రాజకీయ భవిష్యత్ మెండుగా ఉండాలని భావించినట్లుంది. అందుకే జాతీయ మీడియాలో నారా లోకేశ్ ను ఒక రేంజ్ లో పొగిడేందుకు ప్రయత్నించి నవ్వుల పాలవ్వడమే కాకుండా నాయకత్వం ఆగ్రహానికి కూడా గురయ్యారు.

అనవసరంగా లోకేశ్ పేరు తెచ్చి...
ఒక జాతీయ మీడియా ఛానెల్ లో ఆయన ఇండిగో సంక్షోభం గురించి మాట్లాడుతూ అనవసరంగా నారా లోకేశ్ ప్రస్తావన తెచ్చారు. అర్ణబ్ గోస్వామి అడగక ముందే లోకేశ్ అంతా ఇండిగో సంక్షోభాన్ని మానటరింగ్ చేస్తున్నారంటూ గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. అది వికటించింది. అసలు నారా లోకేశ్ ఇండిగో సంక్షోభం గురించి పట్టించుకోలేదు. అది ఆయన పని కూడా కాదు. లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనకు వెళ్లిపోయారు. కానీ దీపక్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నారా లోకేశ్ వార్ రూమ్ నుంచి ఇండిగో సంక్షోభం నుంచి బయటపడేయటానికి ప్రయత్నించారని అనడంతో అర్ణబ్ గోస్వామి దుమ్ము దులిపేశాడు. లోకేశ్ కు, టీడీపీకి సివిల్ ఏవియేషన్ తో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చంద్రబాబు వివరణ...
ఇక ఈ క్లిప్పింగ్ లను పట్టుకుని వైసీపీ నేతలు ఒక ఆటాడుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఇండిగో సంక్షోభం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. ఇండిగో ప్రమాణాలను పాటించలేదని, అందువల్లనే ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని చంద్రబాబు తెలిపారు. తమకు దానితో సంబంధం లేదని తేల్చి చెప్పి నష్ట నివారణ చర్యలు చంద్రబాబు స్వయంగా చేపట్టారు. ఇండిగో సంక్షోభం అంతర్గత విషయమని చంద్రబాబు తేల్చిచెప్పారు. జాతీయ మీడియాలో పార్టీతో పాటు లోకేశ్ పై కూడా విమర్శలు పెద్దయెత్తున రావడంతో దీపక్ రెడ్డికి గట్టిగానే అక్షింతలు పడ్డాయని తెలిసింది. తెలిసి, తెలయకుండా జాతీయ మీడియా ఎదుట మాట్లాడవద్దని, పార్టీ పరువును తీయవద్దంటూ పార్టీ అగ్రనేతలు క్లాస్ పీకినట్లు సమాచారం.


Tags:    

Similar News