Undavalli Arun Kumar : ఉండవల్లి జోస్యంలో నిజమెంత? కూటమి కలసి ఉండదా?
ఉండవల్లి అరుణ్ కుమార్ కూటమిలో మిత్ర పక్షాలు కలసి ఉండటం కష్టమేనని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
ఉండవల్లి అరుణ్ కుమార్ కూటమిలో మిత్ర పక్షాలు కలసి ఉండటం కష్టమేనని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ను ఓడించడానికి మాత్రమే కూటమిగా మూడు పార్టీలు ఏర్పడ్డాయని, అయితే తర్వాత మూడు పార్టీల మధ్య సఖ్యత లేదని చెబుతున్నారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలపై టీడీపీ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లికి ఏం తెలుసునని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరో పదిహేనేళ్ల పాటు కూటమి కలిసి ఉంటుందని చెబుతున్నప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ అలా వ్యాఖ్యానించడంలో అర్థమేమిటని నిలదీస్తున్నారు.
కొంత వాస్తవం లేకపోలేదంటూ...
ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన దాంట్లో కొంత వాస్తవముందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పై స్థాయిలో చంద్రబాబు, లోకేశ్, నరేంద్ర మోదీ కలసి ఉండవచ్చేమో కాని గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే మూడు పార్టీలు విడిపోయాయని చెబుతున్నారు. దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. నియోజకవర్గాల్లోనూ, జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామస్థాయిలోనూ జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. అవి పూడ్చలేనంతగా ఏర్పడ్డాయంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చేమోనని కొందరు నెట్టింట వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
గ్యాప్ పెరిగిందని...
2024 ఎన్నికల్లో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మూడు పార్టీల నేతలు కలసి నాటి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాయి. అయితే రెండేళ్లలోనే పదవుల విషయంలోనూ, కాంట్రాక్టుల కేటాయింపులోనూ కూటమి పార్టీ నేతల మధ్య గ్యాప్ భారీగా పెరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందన్న కామెంట్స్ కూడా కూటమి నేతలు చేస్తున్నారు. అమరావతిలో కూర్చుని చంద్రబాబు, పవన్ తాము కలిసే ఉన్నామని చెప్పినా కుదరదని, లోకల్ గా లీడర్లు సఖ్యతగా లేకపోతే కూటమి విచ్ఛిన్నమయినట్లేనని అంటున్నారు. మొత్తం మీద ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.మరి ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారన్నది చూడాలి.