రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ధోరణి గమనించండి. వారి పోరాట పంథాలను గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో చిన్న చిన్న పోరాటాలు చేస్తూనే ఉన్నారు. జాబితా కట్టడానికి ఏదో కొన్ని కార్యక్రమాలైతే జరుగుతున్నాయి. కానీ ఎంత చేసినా.. ప్రజల్లో నామమాత్రపు స్పందన మాత్రం కరవౌతోంది. అసలు ఏపీసీసీ ఏం చేస్తున్నదో? ఏం చేయడం లేదో? పట్టించుకునే ఉద్దేశం కూడా అధిష్ఠానానికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. రఘువీరా అండ్ కో తమ మనుగడ కోసం మాత్రమే పోరాటాలు చేస్తున్నట్లుగా ఉంది. అదే సమయంలో తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ తెరాస సర్కారు మీద కాంగ్రెస్ విపక్షంగా ఒక రేంజిలో విరుచుకు పడుతోంది. తెరాస సర్కారు గానీ, అధినేతగా కేసీఆర్ గానీ పట్టించుకుంటున్నది తక్కువే అయినప్పటికీ.. కాంగ్రెస్ నిరంతర పోరాటాలు సాగిస్తూనే ఉంది.
అంతకంటె ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మనుగడ, పోరాటాలు ఇత్యాది వ్యవహారాల మీద జాతీయ నాయకత్వం ఎక్కువ ఫోకస్ పెడుతోంది. వరుసగా గమనిస్తే.. జాతీయ నాయకత్వం తరఫున ప్రతినిధులు తెలంగాణ పీసీసీ కార్యవర్గానికి ఊపిరాడనివ్వకుండా పని పెట్టేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా, మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ సింగ్, రెండు తెలుగు రాష్ట్రాల వ్యవహారాలు మొత్తం తన కనుసన్నల్లోనే నడవాలని కోరుకునే కొప్పుల రాజు ... ఇలా ఒకరి తర్వాత.. ఒకరు రాష్ట్ర నాయకత్వాన్ని ఫాలో అప్ చేస్తూ ఎలాంటి కార్యచరణతో ముందుకు పోవాలో వారికి పదేపదే పురమాయిస్తూ పోరాటాలు దగ్గరుండి చేయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఏతావతా ఈ పరిణామాల్ని బట్టి అర్థమవుతున్నదేంటంటే.. తెలంగాణ రాష్ట్రం మీదనే కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి అంతో ఇంతో ఆశ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇక ఏం చేసినా సరే.. పార్టీ నిలదొక్కుకోవడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా పోరాడుతూ ఉంటే.. కొన్నాళ్లలో పూర్వవైభవం రాకపోయినా.. కనీసం గౌరవప్రదంగా సీట్లు గెలుచుకునే స్థాయికి రావచ్చుననే నమ్మకంతోనే కాంగ్రెస్ ఇలా విరామం లేని పోరాటాలతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.