తెదేపాలో అనంత ముఠా రాజకీయాలకు పరాకాష్ట

Update: 2016-11-22 12:02 GMT

అనంతపురం వేదికగా తెలుగుదేశం పార్టీలోని ముఠా రాజకీయాలు, తగాదాలు, కీచులాటలు వీధిన పడుతున్నాయి. నాయకుల మధ్య ఉన్న వైషమ్యాలు పార్టీ పరువును నట్టేట ముంచుతున్నాయి. అనంతపురం అంటే.. అక్కడ ఎంపీ తెలుగుదేశం వారే.. జెసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, నగర మేయర్ స్వరూప కూడా తెలుగుదేశానికి చెందిన వారే. ట్విస్టు ఏంటంటే.. ఈ ముగ్గురివీ మూడు వర్గాలు. ఎవరికి వారే యమునా తీరే చందం కూడా కాదు.. మూడు వర్గాలు పరస్పరం కలబడిపోతుంటాయి. తగాదాలు పడుతుంటాయి.

తాజాగా అనంతపురం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంజూరు చేసిన అభివృద్ధి పనులు జరగకుండా... స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప అడ్డుపడుతున్నారంటూ... సాక్షాత్తూ అదే పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నగరంలో ధర్నా చేశారు. ఆయన స్థానికులతో కలసి కార్పొరేషన్ కార్యాలయం ఎదుటే రోజంతా ధర్నా చేయడం విశేషం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంపీస్వయంగా దీక్ష చేసినా.. ఏ వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. సాయంత్రం పోలీసులు జోక్యం చేసుకుని.. ఆయన దీక్షను భగ్నం చేసి.. అక్కడినుంచి తరలించి, ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే...

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారో అంతకంటె పెద్దసంఖ్యలో పరస్పరం కత్తులు దూసుకునేంత కక్షలతో ద్వేషాలతో రగిలిపోయే ముఠాలు కూడా ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. అనంతపురం నగర రాజకీయాలనే తీసుకుంటే.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప ముగ్గురూ మూడు దిక్కుల్లో నడుస్తూ.. ప్రగతి పనులు చతికిల పడేలా చేస్తున్నారు. అయితే అనంత ముఠా రాజకీయాలకు చెక్ పెట్టడానికి పార్టీ పరంగా చంద్రబాబునాయుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మాత్రం అర్థం కాని సంగతి.

Similar News