డ్రా దిశగా తొలిపోరు : 3 రోజుల్లో 5 సెంచరీలు!

Update: 2016-11-12 02:49 GMT

మూడు రోజులో ఆటలో అయిదు సెంచరీలు నమోదు అయ్యాయంటే.. రెండుజట్ల ఒకటో ఇన్నింగ్స్ పర్వం ఇంకా పూర్తి కాలేదంటే.. ఇక ఆ మ్యాచ్ ఫలితం దిశగా నడుస్తుందని అనుకోవడం భ్రమ. ఎవరికి వారు రికార్డులు చేసుకునే అవకాశం ఉంటే ఆ మేరకు ఆడుకుంటే.. మ్యాచ్ ఎంచక్కా డ్రా అయిపోతుంది. ఇప్పుడు రాజ్‌కోట్‌లో భారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలిపోరు పరిస్థితి ఇలాగే ఉంది. తొలి రెండురోజుల ఆటను మింగేసిన ఇంగ్లాండ్ జట్టు 537 పరుగుల భారీ లక్ష్యాన్ని మన ముందుంచింది. అప్పటికే వారి జట్టులో ముగ్గురు సెంచరీలు చేశారు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యాక మూడో రోజు ఆటలో రెండు సెంచరీలు నమోదు అయ్యాయి. ఇప్పటికి నాలుగు వికెట్లు మాత్రమే పడ్డాయి. ఇంకా 200 పైచిలుకు పరుగుల వ్యత్యాసం ఉంది. ఇదంతా భర్తీ అయి సెకండిన్నింగ్స్ పర్వం మొత్తం నడిచేసరికి మ్యాచ్ ఖచ్చితంగా డ్రా కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

రాజ్ కోట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 3 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. మూడోరోజు ఆటలో గౌతం గంభీర్ 29 పరుగులకు త్వరగానే అవుట్ అయిపోగా, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా ఇద్దరూ సెంచరీలు చేశారు. విరాట్ కొహ్లి 26 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టెయిల్ ఎండర్ గా మూడోరోజు బరిలోకి దిగిన అమిత్ మిశ్రా అవుటయ్యాడు. ఆ దశలో ఇవాళ నాలుగోరోజు ఆట జరగాల్సి ఉంది. భారత్ ప్రస్తుతం చేతిలో 6 వికెట్లతో 218 పరుగులు వెనుకబడి ఉంది. విరాట్ కొహ్లి గనుక విశ్వరూపం ప్రదర్శించి నాలుగోరోజు లంచ్ సమయంలోగా ఈ పరుగుల వ్యత్యాసాన్ని పూరించేసి.. లంచ్ తర్వాత చివరి సెషన్ లో ఇంగ్లాండ్ ను బ్యాటింగ్‌కు దించి వారి మీద ఒత్తిడి పెట్టగలిగితే.. మ్యాచ్ ఫలితం దిశగా నడవడానికి కొంత మేరకు అవకాశం ఉంటుంది. కానీ.. ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా అంత ఆషామాషీగా ఏమీ లేని పరిస్థితిలో ఇంత సులువుగా నాలుగోరోజు ఆట సాగకపోవచ్చు. భారత్ కూడా భారీ స్కోరు నమోదు చేసి.. ఇంగ్లాండ్ స్కోరు కంటె పెద్ద తేడాతో స్కోరు చేసి, నాలుగో రోజు చివర్లో ఇంగ్లాండ్ కు సెకండిన్నింగ్స్ అప్పగిస్తే కూడా ఫలితం దిశగా నడిచే అవకాశం ఉంది.

అలాంటి సంభావ్యతలు జరగకపోతే గనుక.. అచ్చంగా తొలి టెస్ట్ డ్రా అవుతుందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News