అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహుశా చాన్నాళ్లుగా తన మనసులో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహాన్ని శుక్రవారం నాడు ఒక్కసారిగా బయటపెట్టారు. అమెరికా లోని మీడియా తన మీద పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నదంటూ నిప్పులు చెరిగారు. ట్రంప్ గెలిచిన నాటినుంచి ట్రంప్ అధ్యక్షుడిగా మాకు వద్దంటూ ప్రజల నిరసనలు అమెరికా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నట్లుగా అమెరికన్ మీడియా ద్వారా వార్తలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి.
ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత.. మెజారిటీ జనామోదాన్ని సాధించి.. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక అయిపోయిన తర్వాత.. కూడా ఆయనను ఆమోదించడానికి ఒప్పుకోకుండా.. కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిరసనలు రావడం అనేది ఆశ్చర్యకరమైన సంగతి. అయితే.. అమెరికన్ మీడియా ద్వారా.. ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ఇలాంటి నిరసనలు మాగ్జిమం ఎక్కువ ప్రచారానికి నోచుకున్నాయి. ట్రంప్ పేరుకు గెలిచాడే గానీ.. అమెరికన్ ప్రజలంతా ఆయనను అసహ్యించుకుంటున్నారు.. అని ప్రపంచం మొత్తం ముక్కున వేలేసుకునే స్థాయిలో ప్రచారం జరుగుతున్నదంటే అతిశయోక్తి కాదు.
కాబట్టే ఇలాంటి ప్రచారం మీద సహజంగానే ట్రంప్ కు ఆగ్రహం వచ్చింది. ఎంత చెడ్డా.. ఆయన ఇప్పుడు ప్రపంచంలోని అగ్రరాజ్యానికి జనం ఎన్నుకున్న అధినేత. ఆయన తన దేశపు మీడియా మీద నిప్పులు కురిపించాడు. అమెరికాలోని మీడియా పని గట్టుకుని తనకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మీడియా.. ఎన్నికలకు ముందు కూడా.. తాను ఓడిపోవాలని పనిగట్టుకుని ప్రచారం చేసిందంటూ ఆయన పేర్కొనడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే.. ఎన్నికలకు ముందు అమెరికాలోని ప్రధాన మీడియా పనిగట్టుకుని ట్రంప్ వ్యతిరేక ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ప్రచారాలను అధిగమించి ఆయన ప్రజల ఆదరణను సాధించగలిగారు. ఇప్పటికీ తన మీద ప్రచారాలు మాత్రం తగ్గకపోయే సరికి ఆయనకు కోపం వచ్చినట్లుంది. అందుకే మీడియా మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో మీడియో కూడా చాలా బలమైన పాత్ర పోషిస్తుంటుంది. మరి ట్రంప్, ఈ మీడియా మధ్య ఏర్పడుతున్న ప్రతిష్టంభన ఎన్నాళ్లుంటుందో చూడాలి.