కేరళలో వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యుఒడికి చేరుకుంటున్న వారిని రోడ్డుపైనే రక్షించగలిగారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. తీవ్రంగా గాయపడిన రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు ఆసుపత్రికి తరలించే సమయం లేకపోవడంతో రోడ్డుపైనే అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ థియేటర్ లేదు, పరికరాలు లేవు, క్షణాలు మాత్రమే ఉన్నాయి. అయినా వెంటనే నిర్ణయం తీసుకుని చికిత్సకు దిగారు.మొబైల్ ఫోన్ టార్చ్‌ల వెలుతురులో, స్థానికులు, పోలీసులు సహకరించడంతో రోడ్డే తాత్కాలిక ఆపరేషన్ థియేటర్‌గా మారింది. శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి షేవింగ్ బ్లేడ్, జ్యూస్ పేపర్ స్ట్రాతో శ్వాస మార్గం ఏర్పాటు చేసి ప్రాణాలు నిలబెట్టారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో వలియకులం వద్ద స్కూటర్, బైక్ ఢీకొన్నాయి. స్కూటర్‌పై వెళ్తున్న కొల్లం జిల్లా వాసి లిను, బైక్‌పై ఉన్న విపిన్, మను రోడ్డుపై పడిపోయారు. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ గాయపడ్డారు.
ముగ్గురు గాయాలు పాలై...
అక్కడ చేరిన జనానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కోట్టయం కార్డియోథొరాసిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనూప్ బీ అక్కడికి చేరుకున్నారు. ఫోర్ట్ కొచ్చిలో కోచిన్ కార్నివల్ సందర్భంగా జరిగిన 35 కిలోమీటర్ల సైకిల్ రేస్‌లో పాల్గొని కోట్టయానికి తిరిగి వెళ్తున్నారు. పరిస్థితిని గమనించిన డాక్టర్ మనూప్ పరీక్షించారు. విపిన్‌కు స్వల్ప కదలికలు కనిపించాయి. మను స్పృహలో ఉన్నాడు. లిను మాత్రం కదలకుండా పడి ఉన్నాడు. ముఖ ఎముకలు విరగడం, వెన్నెముక గాయం కారణంగా లిను శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. శ్వాస మార్గం పూర్తిగా మూసుకుపోయిందని గుర్తించిన డాక్టర్ మనూప్, వెంటనే చికిత్స చేయకపోతే మెదడుకు ఆక్సిజన్ అందక ప్రాణాపాయం తప్పదని అంచనా వేశారు.
వైద్యులందరూ కలసి...
అదే సమయంలో మరో ఇద్దరు వైద్యులు అక్కడికి చేరుకున్నారు. ఇందిరా గాంధీ కోఆపరేటివ్ హాస్పిటల్, కడవంతర క్యాజువాల్టీ విభాగంలో పనిచేసే డాక్టర్ థామస్ పీటర్, డాక్టర్ ధిదియా థామస్ దంపతులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. ముగ్గురు కలిసి వెంటనే చికిత్సకు సిద్ధమయ్యారు.సమీప దుకాణం నుంచి షేవింగ్ బ్లేడ్ తెప్పించారు. సాఫ్ట్ డ్రింక్ ప్యాకెట్‌లోని పేపర్ స్ట్రాను ఉపయోగించారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో స్థానికులు మొబైల్ లైట్లతో వెలుతురు అందించారు. డాక్టర్ మనూప్ చర్మం కోసి, శ్వాసనాళంలో స్ట్రా పెట్టి గాలి ఊదారు. గాలి ఊపిరితిత్తులకు చేరడంతో లిను శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు.తక్షణమే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో గుండె ఆగినప్పటికీ సీపీఆర్‌తో ప్రాణాలు నిలబెట్టారు. ప్రస్తుతం లిను పరిస్థితి విషమంగానే ఉన్నా, రోడ్డుపైనే చేసిన ఈ సాహసోపేతమైన చికిత్స అతని ప్రాణాలను కాపాడిందని వైద్యులు తెలిపారు.